ప్రజాశక్తి-గుంటూరు : సహకార సంఘ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో సోమవారం బ్రాడీపేటలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో సహకార సంఘాల ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐక్య వేదిక నాయకులు పి.వెంకటరెడ్డి, ఎం.వెంకటేశ్వరరావు, జి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై రానున్న రోజుల్లో దశల వారీ ఉద్యమం చేపట్టినట్లు చెప్పారు. గ్రామాలలో పిఎసిఎస్‌లలో రైతులు మాత్రమే వాటాదారులుగా ఉండాలని, కానీ 50 శాతం వాటాలను ప్రైవేటు వ్యక్తులకు, కంపెనీలకు ఇస్తూ 1964 చట్టానికి చేసిన సవరణను రద్దు చేయాలని కోరారు. ఇప్పటి దాకా రైతుల భాగస్వామ్యంతో నిర్వహించే సంఘాలు ప్రైవేటు వ్యక్తుల ఆధిపత్యంలోకి వెళ్లకూడదన్నారు. జిఒ 36, 90 ప్రకారం వేతనాలు అమలు చేయాలని, 2016 ఏప్రిల్ 1 నుండి మోనిటరీ బెన్ఫిట్స్ చెల్లించాలని, రిటైర్‌మెంట్ బెనిఫిట్లు, గ్రాట్యుటీ అమలు చేయాలన్నారు. హెచ్‌ఆర్ పాలసీని పూర్తి స్థాయిలో అమలు చేయటానికి గతంలో మాదిరిగా ప్రభుత్వం, బ్యాంకులు, సంఘాలు కలిపి క్యాడర్ ఫండ్ ఏర్పాటు చేయాలని, ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చిన తర్వాత మాత్రమే బదిలీలు చేయాలని స్పష్టం చేశారు. పిఎసిఎస్ ఉద్యోగుల వేతన సవరణ ప్రభుత్వంతో సంబంధం లేకుండా, డిసిసిబి ఉద్యోగుల మాదిరిగా ప్రత్యేక కమిటీ ద్వారా ప్రతి ఐదేళ్లకోసారి నిర్ణయించాలన్నారు. 2019 ఏప్రిల్ 1 నాటి వేతన సవరణ తక్షణమే చేసి, సవరణ జీతాలు అమలు చేయాలని, పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచాలన్నారు. ధర్నాలో డి.శ్రీనివాసరావు, వై.వి.నారాయణ, ఆర్.రమేష్, కె.చంద్రమౌళి, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.










