Apr 17,2023 21:37

ప్రజాశక్తి - ఏలూరు
         రాష్ట్ర ప్రభుత్వం సహకార సంఘాలను నిర్వీర్యం చేసే ప్రయత్నాలను ఉపసంహరించుకోవాలని ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీ డిమాండ్‌ చేశారు. సోమవారం అగ్రికల్చర్‌ కోపరేటివ్‌ సొసైటీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో స్థానిక జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాకు జిల్లా నలుమూలల నుండి ఉద్యోగుల హాజరయ్యారు. ఈ సందర్భంగా సాబ్జీ మాట్లాడుతూ ఎన్నికల ముందు సహకార సంఘాలను పటిష్టం చేస్తామని వాగ్దానం చేసిన ముఖ్యమంత్రి ప్రస్తుతం సహకార సంఘాలనే ప్రయివేటు పరం చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ చట్ట సవరణ ప్రకారం 50 శాతం షేర్లను బయట వ్యక్తులకు, సంస్థలకు అమ్మే ప్రయత్నాన్ని విరమించుకోవాలని, చట్ట సవరణను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అదే చట్టసరణలో ఆర్‌బికెలను సహకార సంఘాల్లో విలీనం చేయొచ్చనే తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. యూనియన్‌ గౌరవ అధ్యక్షులు డిఎన్‌విడి.ప్రసాద్‌, జిల్లా అధ్యక్షులు కెవివి.సత్యనారాయణ, రాష్ట్ర నాయకులు టి.గంగరాజు, జిల్లా కార్యదర్శి పి.సుబ్బారావు మాట్లాడుతూ పిఎసిఎస్‌ను ప్రయివేటు వ్యక్తులకు, సంస్థలకు అమ్మే ప్రయత్నాలు విరమించాలని డిమాండ్‌ చేశారు. రైతు భరోసా కేంద్రాలను సంఘాల్లో విలీనం చేస్తూ 1964 చట్టానికి చేసిన సవరణను రద్దు చేయాలన్నారు. జిఒ 36 ప్రకారం వేతనాలను ఇతర బెనిఫిట్లను వెంటనే అమలు చేయాలని కోరారు. 2019 నుండి కొత్త వేతన సవరణ చేయాలనీ, ధాన్యం సేకరణలో సంఘాలకు కలుగుతున్న ఇబ్బందులను నష్టాలను తొలగించాలనీ, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ఉద్యోగ విరమణ వయసు 62 సంవత్సరాలకు పెంచాలని కోరారు. టిడిఎస్‌ సహకార సంఘాలకు వర్తింపచేయరాదన్నారు. జిల్లా డిసిసిబి వెనక్కి కట్టించుకున్న ఆరు శాతం వడ్డీ రాయితీ వెంటనే సర్దుబాటు చేయాలని, 2010-11 నుండి నేటి వరకూ 13 సంవత్సరాల క్రితం సహకార సంఘాల ధనంపై రావాల్సిన ఆరు శాతం డివిడెండు లేదా వడ్డీ వెంటనే చెల్లించాలన్నారు. ధర్నా అనంతరం జిల్లా రెవెన్యూ అధికారికి వినతిమాత్రం సమర్పించారు. ఈ ధర్నాకు జి.వీరయ్య, పి.రాధాకృష్ణ, ఆర్‌.గణేష్‌, సర్వేశ్వరరావు, సత్యనారాయణరాజు, లక్ష్మీనారాయణ, జివికె.కుమార్‌ ప్రసంగించారు.
సొసైటీ ఉద్యోగుల ఆందోళనకు తెలుగుదేశం మద్దతు
తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఆందోళన చేస్తున్న సహకార సంఘాల ఉద్యోగులకు తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతు ప్రకటించింది. ఉద్యోగుల దీక్షా శిబిరం వద్దకు వచ్చిన టిడిపి ఏలూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి బడేటి చంటి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని కోరారు. యూనియన్‌ నాయకత్వంతో చర్చలు జరిపి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏలూరు మాజీ డిప్యూటీ మేయర్‌, టిడిపి నాయకులు బోడే వెంకటరత్నం పాల్గొన్నారు.