May 21,2022 06:41

సర్వోన్నత న్యాయస్థానం వస్తు సేవల పన్ను (జిఎస్‌టి)పై గురువారం ఇచ్చిన తీర్పు ఎంతో ప్రాధాన్యత గలది. జిఎస్‌టి మండలి నిర్ణయాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి వుండాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జిఎస్‌టి మండలి ప్రతిపాదనలను అడ్డు పెట్టుకొని, వాటిని అమల్జేస్తున్నామనే నెపంతో చట్ట విరుద్ధంగా సముద్రతల దిగుమతులపై ఐజిఎస్‌టిని వసూలు చేయడాన్ని సమర్థించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించడాన్ని సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది. ఈ మేరకు గుజరాత్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. దేశం యొక్క 'సహకార సమాఖ్య' వ్యవస్థ ప్రాధాన్యతను గుర్తు చేస్తూ, ప్రజాస్వామ్య విలువలను, కేంద్ర, రాష్ట్రాల పరస్పర సహకార బాధ్యతను గుర్తు చేస్తూ కేంద్ర సర్కార్‌కు జస్టిస్‌ డివై చంద్రచూడ్‌, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌తో కూడిన ధర్మాసనం మొట్టికాయలు వేసింది. సర్వోన్నత న్యాయస్థానం తన తీర్పు ద్వారా రాష్ట్రాల హక్కులను కాపాడింది. పన్నుల వసూళ్లకు సంబంధించి కేంద్రానికి ఏ విధమైన హక్కులు దఖలు పడ్డాయో అదే విధమైన హక్కులను రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా రాజ్యాంగంలో పొందుపర్చారు. అయితే జిఎస్‌టి మండలికి అటువంటి అధికారాలు లేవని ధర్మాసనం స్పష్టం చేసింది. చట్టం ప్రకారం అది కేవలం ప్రతిపాదనలు సూచించేందుకు ఉద్దేశించిన ఒక ఏర్పాటు మాత్రమేనని కుండబద్దలు కొట్టింది. పన్నుల రూపకల్పనపైన కానీ, వాటిని అమల్జేసే విషయంలో కానీ జిఎస్‌టి మండలికి ఏ విధమైన అధీకృతమైన హక్కులూ లేవు. పన్నుల విషయంలో రాష్ట్రాలకు ఉన్న హక్కులను కాలరాసే హక్కులూ దానికి లేవు. జిఎస్‌టి మండలి తీసుకునే నిర్ణయం చట్టమైపోదని, జిఎస్‌టికి సంబంధించి కూడా చట్టాలు చేసే అధికారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకే ఉందని ధర్మాసనం నొక్కి చెప్పింది. జిఎస్‌టి మండలి ప్రతిపాదనలకు అనుగుణంగా ప్రభుత్వాలు చేసే చట్టాలు, నిబంధనలను సమీక్షించే అధికారం కూడా సుప్రీంకోర్టుకు ఉందని ధర్మాసనం స్పష్టంచేసింది.
ఇన్నాళ్లూ కేంద్రం ప్రభుత్వం జిఎస్‌టి మండలిని అడ్డుపెట్టుకుని రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ వస్తోన్న సంగతి విదితమే. వివిధ రంగాలకు సంబంధించిన సేవలు, పలు రకాల వస్తువులలో వేటిపై ఎంత పన్ను వేయాలనేది జిఎస్‌టి మండలి నిర్ణయిస్తూ వచ్చింది. రాష్ట్రాలపై పెత్తనం సాగించేందుకు జిఎస్‌టి మండలిని కూడా మోడీ సర్కార్‌ పావుగా వాడుకుంది. రాష్ట్రాల అభిప్రాయాలను ముఖ్యంగా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకోకుండా ఆధిపత్య ధోరణి సాగిస్తూ జిఎస్‌టి నిర్ణయాలనే అమల్జేస్తూ వచ్చింది. రాష్ట్రాల హక్కులను కాలరాసే కేంద్ర ప్రభుత్వ ధోరణిని కేరళ, తమిళనాడు, తెలంగాణ తదితర రాష్ట్రాలు నిలదీస్తూ వచ్చాయి కూడా.
2017లో 'ఒకే దేశం-ఒకే పన్ను' పేరిట రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్ర ప్రభుత్వం జిఎస్‌టిని రుద్దింది. క్రమంగా పన్నుల విషయంలో రాష్ట్రాలకున్న హక్కులను గుంజేసుకొని తన చేతుల్లో బందీ చేసుకొని తన వద్దే కేంద్రీకరించుకునేందుకు మోడీ సర్కార్‌ యత్నించింది. సమాఖ్య స్ఫూర్తికి సమాధి కట్టేలా అది వ్యవహరిస్తూ వస్తోంది. వస్తు, సేవల పన్ను ప్రక్రియ అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రాలకు జరిగే నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం భర్తీ చేస్తుందని హామీ ఇచ్చిన మోడీ సర్కార్‌ ఆ నష్టాన్ని పూడ్చకుండా చేతులెత్తేసింది. ఆంధ్రప్రదేశ్‌తో సహా అనేక రాష్ట్రాలకు జిఎస్‌టి బకాయిలు చెల్లించకుండా నేటికీ కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తోంది. తమిళనాడు, కేరళ, తెలంగాణ వంటి రాష్ట్రాలు పదేపదే నిలదీస్తున్నా కోవిడ్‌ విపత్తు సమయంలోనూ బకాయిలు చెల్లించడానికి మోడీ సర్కార్‌కు మనస్కరించలేదు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కేరళ ఆర్థిక మంత్రి కెఎన్‌ బాలగోపాల్‌ అన్నట్టు 'సహకార సమాఖ్య'కు ఉద్దీపన కలిగిస్తుందనడంలో సందేహం లేదు. తీర్పు వల్ల ప్రస్తుత ప్రక్రియపై ఎటువంటి ప్రభావమూ ఉండబోదని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి తరుణ్‌ బజాజ్‌ పేర్కొన్నారు. ధర్మాసనం నొక్కి చెప్పిన సమాఖ్య స్ఫూర్తికి విలువ ఇవ్వాలనే అభిప్రాయం కేంద్ర ప్రభుత్వం నుంచి వెలువడకపోవడం దారుణం. జిఎస్‌టి మండలి నిర్ణయాలను తుచ తప్పకుండా అమల్జేస్తూ వచ్చిన రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం తీర్పు స్వేచ్ఛాయుత నిర్ణయాలు తీసుకునేందుకు వెసులుబాటు కల్పించినట్టయింది.