ప్రజాశక్తి - గ్రేటర్ విశాఖ బ్యూరో/ ఎంవిపి కాలనీ
ఉత్తరాంధ్రలో వ్యవసాయ రంగం ప్రధానంగా సహకార రంగంపై ఆధారపడి ఉందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల కారణంగా ఈ రెండు రంగాల నడ్డి విరుగుతుందని ఉత్తరాంధ్ర ప్రాంతంలోని రైతులు, కార్మికులూ సహకార వ్యవస్థ రక్షణకు భవిష్యతులో సంఘటితోద్యమం నిర్వహించాలని పలువురు వక్తలు ఉద్ఘాటించారు. బుధవారం ఉదయం 11 గంటలకు 'వ్యవసాయ రంగం-సహకార సంఘాల పాత్ర' అన్న అంశంపై ఎపి రైతు సంఘం, అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం సంయుక్తంగా నిర్వహించిన సెమినార్‌లో ఎపి రైతు సంఘం పూర్వ కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశం, రాష్ట్రంలో వ్యవసాయ రంగం చాలా సంక్షోభంలో ఉందన్నారు. సహకార రంగంలో రుణాలిచ్చే బ్యాంకులు, డెయిరీలు, చక్కెర ఫ్యాక్టరీలు, విద్యుత్ సంస్థలన్నిటినీ ధ్వంసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని పంటలు, వ్యవస్థలూ దెబ్బతింటున్న క్రమంలో సహకార రంగాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని వ్యవసాయ, సహకార రంగాలను ముగ్గురు మాయల మరాఠీలకు అప్పగించే యత్నాలు సాగుతున్నాయని విమర్శించారు. సహకార రంగంలో అమూల్, వ్యవసాయ రంగంలో అదానీ, విద్యా రంగంలో బైజూస్ వంటి పెద్ద పెద్ద ప్రైవేట్ సంస్థలు, పెద్ద కంపెనీలకు ప్రభుత్వాలు కట్టబెడుతున్నాయని ఎద్దేవా చేశారు.
సహకార వ్యవస్థపై నిర్లక్ష్యం: వి.కృష్ణయ్య
ఎపి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పాడి పరిశ్రమను అభివృద్ధి చేయడంలో విఫలమైందన్నారు. గుజరాత్‌లోని అమూల్‌కి అప్పగించడం చూస్తే సహకార వ్యవస్థను ఏపిలో దెబ్బతీసే చర్యలు ఆరంభం అయినట్లేనని పేర్కొన్నారు. దీనికి భిన్నంగా కేరళ ప్రభుత్వం గ్రామీణ ఉపాధి పథకంలో భాగంగా ఉన్న పాడి పరిశ్రమను అర్బన్ ఉపాధి పథకంలోకి మార్చి ప్రత్యేక శ్రద్ధతో పాల రంగాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నాల్లో ఉందన్నారు. రెండు ఆవులు లేదా రెండు గేదెలు పెంచుకుని రోజుకు పది లీటర్ల చొప్పున వందరోజుల పాటు ఉత్పత్తి చేస్తే రూ.32వేలు అదనంగా చెల్లించేలా పథకాన్ని అక్కడ రూపొందించారని తెలిపారు. మన రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం గుజరాత్ కంపెనీలో మన పాడి పరిశ్రమను కలిపేసే యత్నాలకు దిగి రైతులను మభ్యపెడుతుందని ఎద్దేవా చేశారు.
ప్రయివేట్ లాభాల కోసమే: విద్యుత్ బిల్లుపై సిహెచ్‌ఎన్నార్
సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్.నరసింగరావు మాట్లాడుతూ, 2022 విద్యుత్ సంస్కరణల బిల్లును కేంద్రం ప్రవేశపెట్టగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టి వ్యవసాయాన్ని దెబ్బతీసే చర్యలకు దిగుతుందని ఎద్దేవా చేశారు. ప్రయివేట్ లాభాల కోసమే విద్యుత్ చట్టాన్ని తెచ్చారని దీన్ని దేశ వ్యాపితంగా (పార్లమెంట్‌లో కూడా) వ్యతిరేకిస్తున్నారన్నారు. దేశం, రాష్ట్రంలో విద్యుత్ రంగంలో ప్రయివేట్‌కి లైసెన్సులు ఇస్తున్నారని టాటా, అదానీలకు పవర్ సెక్టార్ మొత్తాన్ని అప్పగించే కుట్ర మోడీ చేస్తున్నారని విమర్శించారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో రైతులు, కార్మికులు ఈ విద్యుత్ సంస్కరణలపై ఐక్యంగా పోరాడితేనే విద్యుత్ చట్టాలను తిప్పికొట్టగలమని లేదంటే ప్రైవేట్ చేతుల్లోకి వెళ్లిపోతే విద్యుత్ సబ్సిడీలు ఉండవని ఆయన హెచ్చరించారు.
ఉత్తరాంధ్ర సహకార రంగానికి పెట్టింది పేరు : అభివృద్ధి వేదిక కన్వీనర్ ఎ అజశర్మ
రాష్ట్రంలోనే సహకార రంగంలో విశాఖ జిల్లాకు ప్రత్యేకత ఉందని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కన్వీనర్ ఎ అజశర్మ అన్నారు. రాష్ట్రంలో 13 చక్కెర ఫ్యాక్టరీలు సహకార రంగంలో ఉంటే అనకాపల్లి జిల్లాలోనే 4 ఉన్నాయని కానీ గోవాడ ఒక్కటే నడుస్తుందన్నారు. పేరులో ఉన్న సహకారం ఈ రంగాన్ని నిలబెట్టడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా ఉన్నాయన్నారు. నల్లబెల్లం నిషేధం విధించడం, ఇప్పటికే 3 ఫ్యాక్టరీలు మూతపడడం చూస్తే అనకాపల్లి ప్రాంతంలో బెల్లం మార్కెట్‌పై నెగెటివ్ ప్రభావం పడిందన్నారు. చెరకు పండించిన రైతులు ఏం చేయాలో ప్రభుత్వం చెప్పాలన్నారు. సభకు అధ్యక్షత వహించిన ఎపి రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మర్రాపు సూర్యనారాయణ మాట్లాడుతూ, వ్యవసాయ రంగం నిలదొక్కుకోవాలంటే సహకార రంగం మద్దతు తప్పనిసరి అని పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో పిఎసిఎస్‌లు, జిల్లా స్థాయిలో డిసిసిబిలు, రాష్ట్ర స్థాయిలో ఆప్కాబ్‌లను నిర్వీర్యం చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో వ్యవసాయ, సహకార రంగాలు సంక్షోభంలోకి నెట్టబడుతున్నాయన్నారు. విశాఖ జిల్లా ఉద్యోగ సహకార సంఘాల సమన్వయ కమిటీ కన్వీనర్ రెడ్డి వెంకటరావు సహకార సంఘాల పరపతి, సాంకేతిక విషయాలపై ప్రసంగించారు. వేదికపై శ్రీకాకుళం జిల్లా రైతు సంఘం కార్యదర్శి కె మోహనరావు, విజయనగరం జిల్లా కార్యదర్శి (రైతు సంఘం) బుద్ధరాజు రాంబాబు, అనకాపల్లి జిల్లా నుంచి కర్రి అప్పారావు, కాకినాడ అప్పారెడ్డి, పార్వతీపురం లక్ష్మునాయుడు ఉన్నారు.
పిడిఎఫ్ ఎమ్మెల్సీ డాక్టర్ రమాప్రభ పరిచయం
సభా వేదికపై ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ డాక్టర్ కోరెడ్ల రమాప్రభను అతిథులు పిడిఎఫ్ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, విశ్రీనివాసరావు, అజశర్మ, మర్రాపు సూర్యనారాయణ సెమినార్‌కు హాజరైన రైతులకు పరిచయం చేశారు. గ్రామాల్లో విస్తృతంగా ఓట్లు పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థికి పడేలా కృషిచేయాలని పిలుపునిచ్చారు. తాను ఎమ్మెల్సీగా గెలిస్తే పలు అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తానని రమాప్రభ ఈ సందర్భంగా తెలిపారు. వ్యవసాయ, సహకార రంగాల్లో ప్రభుత్వ విధానాల వల్ల రైతులకు కలిగే నష్టంపై పెద్దల సభలో ప్రశ్నిస్తానని, రైతులకు మద్దతుగా నిలుస్తానని ఆమె తెలిపారు.
సెమినార్‌లో పలు అంశాలపై తీర్మానాలు
2023 ఏప్రిల్ 5న ఢిల్లీలో జరిగే రైతు మార్చ్‌కు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలాగ చైతన్యం కలిగించే కార్యకలాపాలు చేపట్టాలని సెమినార్ తీర్మానించింది. అలాగే పలు వ్యవసాయ, సహకార సంబంధిత అంశాలపై తీర్మానాలను విజయనగరం జిల్లా రైతు సంఘం కార్యదర్శి బుద్ధరాజు రాంబాబు సెమినార్‌లో ప్రతిపాదించగా సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. వాటిలో 1. సహకార చక్కెర ఫ్యాక్టరీలను తెరిపించాలని, 2. డెయిరీలలో పాల సేకరణ ధరకు, అమ్మకం ధరకు మధ్య తేడా 20శాతం ఉందని దీన్ని రైతులకు 10శాతం (లీటరుకు) పెంచాలని, 3.ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేయాలని, 4.విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగించవద్దని, 5.ఉచిత విద్యుత్ చట్టం చేయాలని, 6. భూ సేకరణలో రైతులకు మార్కెట్ రేటుకు 4 రెట్లు పరిహారం ఇవ్వాలని, 7.సహకార రంగాన్ని పరిరక్షించాలని తీర్మానాలు చేశారు.










