ప్రజాశక్తి-పాడేరు : సహకార రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని సంయుక్త కలెక్టర్ జె. శివ శ్రీనివాసు పేర్కొన్నారు. జిల్లా సహకార శాఖ ఆధ్వర్యంలో బుధవారం కలక్టరేట్లో వ్యవసాయ, ఉద్యాన వన, మత్స్య, పశు సంవర్ధక శాఖ అధికారులకు, క్షేత్ర స్థాయి సచివాలయం సిబ్బందికి నిర్వహించిన ఒక రోజు వర్కుషాపుకు ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సహకార చట్టం 1964లో ఏర్పాటు చేసారన్నారు. ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాలు రాజ్యాంగబద్ధంగా ఏర్పాటయ్యాయని పేర్కొన్నారు. వ్యవసాయ రుణాలపై రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. వ్యవసాయాధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బంది గ్రామాల్లో పర్యటించి సొసైటీలలో అనుబంధంగా ఉన్న రైతులను సంప్రదించి, వ్యవసాయ పెట్టుబడులు ఏ విధంగా సమకూర్చు కుంటున్నారో తెలుసుకోవాలన్నారు. గిరిజన రైతులను ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలలో సభ్యులుగా చేర్చాలని సూచించారు. రైతులకు పంట నష్టం లేకుండా సొసైటీల ద్వారా పంట కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. సొసైటీలకు పెట్రోలు బంకు ఏర్పాటు, రేషన్ డిపోలు నిర్వహణకు అనుమతులు ఇస్తామని చెప్పారు.
జిల్లా సహకార అధికారి ఎం.వి. రామకృష్ణరాజు మాట్లాడుతూ, రైతులకు పరపతి సంఘాల ద్వారా అందిస్తున్న సేవలను వివరించారు. వ్యవసాయ పెట్టుబడులకు రుణాలు అందిస్తామన్నారు. ఎరువులు వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా రైతులకు సరఫరా చేయడం జరుగుతోందన్నారు.ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి ఎస్.బి. ఎస్.నంద్, జిల్లా ఉద్యాన వన అధికారి రమేష్ కుమార్‌రావు, మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు పి.ఆర్.రాకేష్, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకలు, మండల వ్యవసాయా ధికారులు, వ్యవసాయ, ఉద్యాన వన అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.










