ప్రజాశక్తి-వత్సవాయి : ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్‌రెడ్డి రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఎన్నో పథకాలు ప్రవేశపెడుతున్నారని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను అన్నారు. వత్సవాయి మండలం భీమవరం గ్రామంలో 40 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన డాక్టర్ వైయస్సార్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉదయబాను పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో వ్యవసాయంతో పాటు అన్ని సహకార రంగాలను అభివద్ధి చేస్తున్నారని తెలిపారు. రైతులకు విత్తనం మొదలు విక్రయం వరకు రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి అన్ని రకాల సేవలను అందిస్తున్నారని అన్నారు. గతంలో చంద్రబాబు వ్యవసాయం దండుగా అన్నారని, కానీ నేడు జగన్మోహన్ రెడ్డిపాలనలో వ్యవసాయాన్ని పండుగ చేస్తున్నారన్నారు. అలాగే రైతులు పంట నష్టపోయిన వెంటనే వారికి నష్టపరిహారం అందించడంతోపాటు గిట్టుబాటు ధర కూడా కల్పిస్తున్నారని తెలిపారు.అదేవిధంగా భీమవరం గ్రామం నందు ఇప్పటికే పలు అభివద్ధి కార్యక్రమాలను చేపట్టామని, హైవే నుండి భీమవరం మెయిన్ రోడ్డు త్వరలో అభివద్ధి చేస్తామన్నారు. ఇప్పటికే నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలను అభివద్ధి చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు,లెఫ్ట్ కెనాల్ మాజీ చైర్మన్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి,గ్రామ సర్పంచ్ భీమాల సుజాత, మార్కెట్ యార్డ్ చైర్మన్ ముత్తినేని విజయ శేఖర్, జడ్పిటిసి యేసుపోగు దేవమణీ,ఎంపీపీ చేంబేటి వెంకటేశ్వర్లు,సొసైటీ అధ్యక్షులు పెనుగొండ శ్రీనివాసరెడ్డి, ఎంపీటీసీ సభ్యులు నర్ల సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.










