ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : నగదు రహిత చెల్లింపులతో రైతులకు ఆర్థిక లావాదేవీలు మరింత సులభతరం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సహకార బ్యాంకుల్లో మైక్రో ఏటీఎం సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి చెప్పారు. ఉమ్మడి గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పరిధిలోకి వచ్చే అన్ని సంఘాల్లో మైక్రో ఏటీఎం వ్యవస్థను గుంటూరు బ్రాడీపేటలోని జీడీసీసీ బ్యాంకు ఆవరణలో మంత్రి శుక్రవారం ప్రారంభించారు. తొలి దశ కింద నాబార్డ్, ఆప్కాబ్ సహకారంతో ప్రయోగాత్మకంగా 65 మైక్రో ఏటీఎం సెంటర్లను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. రూ.6045 కోట్ల టర్నోవర్‌తో రాష్ట్రంలోనే రెండవ స్థానంలో నిలిచిన జిల్లా కేంద్ర సహకార బ్యాంకును అభినందించారు. టిడిపి హయాంలో నిర్వీర్యమైన సహకార బ్యాంకింగ్ వ్యవస్థను సిఎం జగన్ బలోపేతం చేశారని, ఈ-క్రాప్ బుకింగ్‌తో నిధుల దుర్వినియోగానికి తావు లేకుండా పారదర్శకంగా రుణాలు మంజూరు చేస్తున్నామని చెప్పారు. అత్యుత్తమ పనితీరు ప్రదర్శించిన సహకార సంఘాల సిబ్బందిని మంత్రి సత్కరించారు. దీనికి ముందుగా రికార్డు స్థాయిలో టర్నోవర్ సాధించినందుకు భారీ కేక్ కట్ చేశారు. బ్యాంకు ఛైర్మన్ రాతంశెట్టి సీతారామాంజనేయులు మాట్లాడుతూ తాను బ్యాంకు ఛైర్మన్ అయ్యే నాటికి రూ.1800 కోట్లుగా ఉన్న బ్యాంకు టర్నోవర్‌ను గత ఐదేళ్లలోనే రూ.6045 కోట్లకు విస్తరించినట్లు చెప్పారు. రైతు పిల్లల ఉన్నత విద్యకు విద్యా రుణాలు, కోల్డ్ స్టోరేజీల ద్వారా రుణాలు మంజూరు, మహిళా స్వయం సహాయక సంఘాలకు అతి తక్కువ వడ్డీకే రుణసౌకర్యం వంటివాటిని అమలు చేస్తున్న ఏకైక బ్యాంకుగా రాష్ట్రంలోనే జీడీసీసీ గుర్తింపు పొందిందన్నారు. బ్యాంకు సీఈఓ కృష్ణవేణి మాట్లాడుతూ సహకార సమైక్య పేరున అక్టోబర్ 30 నుంచి జనవరి 30వ తేదీ వరకు 50 వేల కొత్త ఖాతాల ఏర్పాటే లక్ష్యంగా స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆప్కాబ్ ఛైర్ పర్సన్ ఎం.ఝాన్సీరాణి, జడ్పీ ఛైర్‌పర్సన్ హెనీ క్రిస్టీనా, ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్, రాష్ట్ర సహకార, మార్కెటింగ్ సలహాదారులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఆప్కాబ్ ఎమ్‌డీ శ్రీనాథ్ రెడ్డి, డిసిసిబి డైరెక్టర్లు రామయ్య, హరిబాబు, ఏడుకొండలు, గోవింద నాయక్, శివ నవీన్ పాల్గొన్నారు.










