ప్రజాశక్తి రావికమతం :సకలాంగులకు వికలాంగులు తక్కువ కాదని, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపి ఇతర పిల్లలతో సమానంగా అన్ని విషయాల్లో ముందుకు నడిపేందుకు 'సహిత క్లబ్'లను ఏర్పాటు చేయడం జరిగిందని మేడివాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎం.జయలక్ష్మి తెలిపారు. మేడివాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని సహిత విద్యా విభాగం ప్రత్యేక ఉపాధ్యాయులు మహాలక్ష్మి నాయుడు ఆధ్వర్యంలో సోమవారం సహిత క్లబ్బులను ఏర్పాటు చేశారు. సాధారణ విద్యార్థులతో పాటు దివ్యాంగ విద్యార్థులను కలిపి వారికి క్రీడా పోటీలు రన్నింగ్, మ్యూజికల్ చైర్, పాటల పోటీలను నిర్వహించి గెలుపొందిన విజేతలకు బహుమతులును హెచ్‌ఎం జయలక్ష్మి, ఉపాధ్యాయులు అప్పలనాయుడు, గోవిందరావు, ప్రత్యేక ఉపాధ్యాయులు మహాలక్ష్మి నాయుడు జగన్నాథం నాయుడు చేతుల మీదుగా అందజేశారు.స్కూల్ అసిస్టెంట్, ప్రత్యేక ఉపాధ్యాయులు మహాలక్ష్మి నాయుడు మాట్లాడుతూ, ఈ సహిత క్లబ్ లో స్కూలు హెడ్మాస్టరు, పీఈటీ, రెగ్యులర్ టీచర్, ఐఈఆర్టీ, ఇద్దరు సాధారణ విద్యార్థుల తల్లిదండ్రులు, ఇద్దరు దివ్యాంగ విద్యార్థుల తల్లిదండ్రులు ఉంటారన్నారు. ఇతర పిల్లలతో కలిపి స్కూలు యాక్టివిటీస్‌లో పాల్గొనేలా చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు దివ్యాంగ విద్యార్థులు సాధారణ విద్యార్థులు పాల్గొన్నారు.










