
ప్రజాశక్తి - బాపట్ల
సమాచార హక్కు చట్టాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలు అధికార యంత్రాంగం జవాబు దారీ తనాన్ని మరింత పెంచాలని రాష్ట్ర సమాచార కమిషనర్ పి శామ్యూల్ జోనాథన్ కోరారు. సమాచార హక్కు చట్ట ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఫోరం ఫర్ బెటర్ ఆధ్వర్యంలో స్థానిక వ్యవసాయ కళాశాలలో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకు కళాశాల ఇన్ చార్జ్ ఎడి కోటేశ్వరరావుఅధ్యక్షత వహించారు. సహ చట్టం ద్వారా పాలనలో పారదర్శకత సిద్ధిస్తుందని అన్నారు. స.హ చట్టం సామాన్యుడిని సాధికారిగా చేస్తుందని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లోని రికార్డులను పరిశీలించే అధికారం కూడా ప్రజలకు ఉందని వివరించారు. ఫోరం కార్యదర్శి పిసి సాయిబాబు మాట్లాడుతూ స.హ చట్టాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలను తిప్పి కొట్టాలన్నారు. ఈ చట్టం అటకెక్కకుండా పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని చెప్పారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు ఆచార్య లాల్ అహ్మద్, కోటేశ్వరరావు, బాలాజిరెడ్డి, డేవిడ్ రాజు, రాజారావు, చిత్రకారుడు జీవీ, ప్రసన్నంజనేయులు, అర్జున్, శేఖర్ పాల్గొన్నారు.