Sep 25,2022 23:58

సమావేశంలో సంఘీభావం తెలుపుతున్న సగర సంఘం సభ్యులు

ప్రజాశక్తి-గాజువాక: విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో బాగా వెనకబడి ఉన్న సగర సామాజిక వర్గాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వాలు చొరవ చూపాలని ఉమ్మడి విశాఖ జిల్లాల సగర సంఘం అధ్యక్షుడు గుర్రం నూకరాజు కోరారు. విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల సగర సంఘం ఆధ్వర్యాన గాజువాక ఎస్‌బిటి కాన్ఫరెన్స్‌ హాల్లో ఆదివారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూకరాజు మాట్లాడుతూ, బిసి 'డి'గా ఉన్న తమ సామాజిక వర్గాన్ని బిసి 'ఎ'గా మార్చాలని కోరారు. సగర బిసి కార్పొరేషన్‌ ద్వారా పూర్తి సబ్సిడీతో రుణాలు మంజూరు చేయాలని కోరారు. తమ సామాజిక వర్గంలోని వారంతా మట్టి పనులు, భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కారణంగా రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌, ఎమ్మెల్సీ పదవులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సగర కుల సామాజిక భవనానికి స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కూలిపనిపై ఆధారపడి ఉన్న సగర కులస్తుల్లో 50 ఏళ్లు నిండిన వారికి పింఛన్లు ఇవ్వాలని కోరారు. త్వరలో అన్ని నియోజకవర్గాల్లో సగర చైతన్య సభలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గుర్రం సింహాచలం, నక్క సింహాచలం, ఎం.సన్యాసిరావు, నక్క రాంబాబు, పెంటయ్య, ఎన్‌వి.రమణ తదితరులు పాల్గొన్నారు.