Oct 06,2023 22:21

తుంగభద్ర డ్యాం

        అనంతపురం ప్రతినిధి : నిత్యం కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లాకు ప్రధానమైన సాగునీటి వనరుగా తుంగభద్ర డ్యామ్‌ ఉంది. ఆ డ్యామ్‌ నుంచే తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ ద్వారా జిల్లాకు నీరొస్తుంది. అదే సాగు, తాగునీటి అవసరాలనే తీర్చే ఏకైక వనరుగానుంది. ఈ ఏడాది తుంగభద్ర డ్యామ్‌కు నీరు ఆశించినంత రాలేదు. సాధారణంగా ఆగస్టు, సెప్టంబర్‌ మాసాల్లోనే ఈ డ్యామ్‌కు నీరు పుష్కలంగా వచ్చేది. ఈసారి తుంగభద్ర ఎగువ భాగంలో వర్షాలు ఆశించినంత రాకపోవడంతో డ్యామ్‌ కూడా నీరు చాలా తక్కువగా వచ్చింది. దీంతో డ్యామ్‌ కిందనున్న కాలువలకు నీటి కేటాయింపులు తగ్గిపోయాయి.
సగానికి సగమే..
గతేడాది ఇదే సమయానికి తుంగభద్ర డ్యామ్‌కు 536.20 టిఎంసిల నీరు వచ్చింది. జూన్‌ నుంచి అక్టోబరు నాటికి వచ్చింది. దీంతో గేట్లు ఎత్తి పలుమార్లు నీటిని నదిలోకి వదిలారు. ఇంత పెద్దఎత్తున నీరు రావడంతో ఇదే సమయానికి డ్యామ్‌ కూడా నిండుకుండలాగా తొనకిసలాడుతూ ఉంది. పూర్తి సామర్థ్యంతో 105.79 టిఎంసిల నీరు ఉంది. ఇన్‌ప్లుస్‌ కూడా ఈ సమయానికి 23,727 క్యూసెక్కులుండేవి. ఇప్పుడు చూస్తే అక్టోబర్‌ ఆరవ తేదీ నాటికి డ్యామ్‌లో నీటి మట్టం కేవలం 52.73 టిఎంసిలే ఉంది. 4437 క్యూసెక్కులు మాత్రమే ఇన్‌ప్లోస్‌ ఉన్నాయి. ఇక తుంగభద్ర ఎగువ భాగం పెద్దగా వర్షాలొచ్చే పరిస్థితి కనిపించడం లేదు. జూన్‌ నుంచి ఇప్పటి వరకు వచ్చిన నీరే 106 టిఎంసిలు ఉన్నాయి. ఈ నీటిని ఇప్పటికే వినియోగించుకుంటూ ఉండటంతో సగం తగ్గిపోయాయి. ఈ ప్రభావం దిగువనున్న తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ, దిగువ ప్రధాన కాలువలకు నీటి కేటాయింపుల్లోనూ కోత పడింది.
తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువకు సగానికి కోతే...
తుంగభద్ర డ్యామ్‌లో నీటి లభ్యత తగ్గడంతో తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువకు నీటి కేటాయింపుల్లో కోతపడింది. జూన్‌లో వేసిన అంచనాల ప్రకారం 26.828 టిఎంసిల నీరు వస్తుందనుకున్నారు. తాజా అంచనాల ప్రకారం అది 16 టిఎంసిలకే పడిపోయింది. గతేడాదితో పోలిస్తే సగం కంటే తక్కువే కావడం గమనార్హం. గతేడాది తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ ద్వారా జిల్లాకు వచ్చింది 36.50 టిఎంసిలు. ఈ ఏడాది 16 టిఎంసిలే కావడం గమనార్హం. అది కూడా గతేడాది కంటే తక్కువగా నీరు జిల్లాకు రానుంది. ఇది తాగునీటి అవసరాలకు సరిపోనుంది. ఈ నేపథ్యంలో నీరొస్తుందని ఆశించిన పంటలు సాగు చేసిన ఆయకట్టుకు రైతులకు ఇబ్బందులు తప్పేలా లేవు. ఇదికూడా నవంబరు ఒకటికి నీటిని నిలిపివేసే సూచనలు కనిపిస్తుండటంతో ప్రధానంగా తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ రైతులు తీవ్రంగా నష్టపోయే సూచనలు కనిపిస్తున్నాయి.