Oct 13,2022 23:37

విద్యార్థుల మాక్‌డ్రిల్‌ను వీక్షిస్తున్న మేయర్‌ హరి వెంకట కుమారి

ప్రజాశక్తి -భీమునిపట్నం : జాతీయ విపత్తుల నివారణ దినోత్సవం సందర్భంగా స్థానిక సెయింట్‌ ఆన్స్‌ పాఠశాలలో విద్యార్థులు గురువారం మాక్‌ డ్రిల్‌ ప్రదర్శించారు. నగర మేయర్‌ గొలగాని హరి వెంకట కుమారి మాక్‌డ్రిల్‌ను తిలకించి మాట్లాడారు. జాతీయ విపత్తులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. ముఖ్యంగా విపత్తుల సమయంలో విపత్తు తీవ్రతను తగ్గించేలా లేదా రక్షణ పొందే విధంగా విద్యార్థులకు తర్ఫీదు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. విపత్తుల సమయంలో ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా జపాన్‌ ప్రభుత్వ సహకారంతో ఎస్‌ఆర్‌యు, జివిఎంసి సంయుక్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జివిఎంసి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్‌.సింహాచలం, సెయింట్‌ ఆన్స్‌ ఉన్నత పాఠశాల ప్రిన్సిపల్‌ మేరీ జ్యూడిన్‌ శాంతి, యుఎన్‌డిపి ప్రతినిధి సుభాన్‌ తండన్‌, జివిఎంసి అదనపు కమిషనర్‌ డాక్టర్‌ వి సన్యాసిరావు, ప్రోగ్రాం డైరెక్టర్‌ రాజ మణి, కార్పొరేటర్‌ గంటా అప్పలకొండ, జోనల్‌ కమిషనర్‌ ఎస్‌.వెంకటరమణ, పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.