* ప్రజలకు సమాధానం చెప్పాలి
* టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు కళా వెంకటరావు
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి: సెప్టెంబర్‌లో కరెంట్ కోతలు ఏమిటని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకటరావు అన్నారు. నగరంలోని టిడిపి జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో అన్ని ప్రాంతాల్లో మూడు నుంచి ఆరు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిపేస్తున్నారని చెప్పారు. ప్రజలకు కరెంట్ సరఫరా చేయడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని, దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, విద్యుత్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కరెంట్ లేక జనం ఇబ్బందులు పడుతుంటే విద్యుత్ శాఖ మంత్రి గనుల తవ్వకాలు, టిడిపి నాయకులపై కేసులు నమోదు చేయించడంలో తీరిక లేకుండా ఉన్నారని విమర్శించారు. లోటు విద్యుత్ సమస్య అసలు ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. ప్రతి ఏడాది 12 నుంచి 18 శాతం డిమాండ్ పెరగుతుందని, అందుకనుగుణంగా ప్లానింగ్ చేయకపోవడం వల్లే ఈ దుస్థితి తలెత్తిందన్నారు. విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడం పరిశ్రమలు రావడం లేదని, ఆదాయం తగ్గి అభివృద్ధి కుంటుపడిందన్నారు. రాష్ట్రంలో 2014 వరకు 22 లక్షల మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు ఉండేదని, ఆరు నెలల్లోనే చంద్రబాబు లోటును అధిగమించి అంతరాయం లేకుండా కరెంట్ ఇచ్చేలా చర్యలు తీసుకున్నారని చెప్పారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంట్ ఛార్జీలను ఏడుసార్లు పెంచిన ప్రభుత్వం విద్యుత్‌ను మాత్రం సక్రమంగా పంపిణీ చేయడం లేదని విమర్శించారు. విద్యుత్ ఉత్పత్తి కోసం బ్యాంకుల నుంచి రూ.36 వేల కోట్లు, ఛార్జీల రూపంలో రూ.78 వేల కోట్లు వచ్చాయని రూ.లక్ష కోట్లను ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలు తరుపున టిడిపి ప్రశ్నిస్తోందన్నారు. రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గ్రహణం పట్టిందని, వచ్చే ఎన్నికల్లో దాన్ని వదిలించుకోవాలన్నారు. సమావేశంలో టిడిపి జిల్లా ఉపాధ్యక్షుడు పి.ఎం.జె బాబు, రాష్ట్ర ఎస్‌సి సెల్ ప్రధాన కార్యదర్శి ఎస్.వి రమణ మాదిగ, నాయకులు లంక శ్యామలరావు, బి.మల్లేశ్వరావు, చౌదరి సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.










