రక్తం చిందించకుండా ఈ విలీనం జరిగిందని భారత ప్రభుత్వం ఘనంగా ప్రకటించుకొంది. ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, వారికి నాయకత్వం వహించిన కమ్యూనిస్టు కార్యకర్తలు చిందించిన రక్తాన్ని, అనుభవించిన దౌర్జన్యాన్ని చూడటానికి నిరాకరిస్తున్నారు. ఈ పోలీస్ చర్య నిజాం నుండి ప్రజల్ని విముక్తం చేయలేదు సరికదా...ప్రజల నుండి నిజాంని, తెలంగాణ ప్రాంతంలోని ప్రజా కంటకులైన భూస్వాములకు విమోచన కల్గించింది.
సెప్టెంబర్ 1948లో జనరల్ జె.ఎన్.చౌదరి నాయకత్వంలో భారత సైన్యం...సైనిక చర్యను జరిపిన రోజును పాలక పార్టీలు-ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ''తెలంగాణ విమోచన దినం''గా చెబుతున్నాయి. బిజెపి భావజాలాన్ని సమర్ధించే మేధావులే గాక నాటి విషయాలు తెలియని నూతన తరం యువకులు కూడా అన్యాపదేశంగా ఇదే మాటను ఉపయోగిస్తున్నారు. నైజాం నవాబు లొంగుబాటుతో జరిగింది నిజంగా తెలంగాణ విమోచనేనా? ఈ చర్య తెలంగాణ ప్రజల దాశ్యానికి తెర దించిందా? విమోచన జరిగితే ఎవరి నుండి ఎవరికి జరిగింది? ఆలోచిస్తే ఈ ''తెలంగాణ విమోచన దినం'' అనే పదబంధమే ఒక మోసంగా అర్ధమవుతుంది. ఆ విషయాలను రేఖామాత్రంగానైనా తెల్సుకోవాల్సిన అవసరం వుంది.
1947 ఆగస్టు 15న భారత దేశానికి ''స్వాతంత్య్రం'' వచ్చిందనే స్పృహగాని, ఆ సందర్భంగా జరిగిన సంతోష సంబరాలు గాని తెలంగాణ భూభాగం లోని ప్రజలకు లేవు. బ్రిటిష్ కాలం నాటి 500 సంస్థానాల్లో అతి పెద్దదైన నిజాం సంస్థానం భారత యూనియన్‌లో కలవటానికి అంగీకరించలేదు. తాను స్వతంత్రంగా ఉండటానికి మద్దతిస్తాయని భావించిన ఇంగ్లీషు ప్రభుత్వం, కొత్తగా ఏర్పడిన పాకిస్తాన్ ప్రభుత్వమూ మొఖం చాటేశాయి.
సంస్థానం లోపల కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో ప్రజలు నిరంకుశ పాలనపై వీరోచితంగా పోరాడుతున్నారు. 30 లక్షల ఎకరాల భూమి పంచుకొని అనుభవిస్తున్నారు. మూడు వేల గ్రామాల్లో గ్రామ రాజ్యాలు ఏర్పడ్డాయి. భారత సైన్యం ప్రవేశించే నాటికే ఈ పంపకాలు జరిగిపోయాయి. భూస్వాములు గ్రామాలు వదలి హైదరాబాద్, వరంగల్ లాంటి పట్టణాలకు పారిపోయారు.
సెప్టెంబర్ 13న యూనియన్ సైన్యాలు నైజాంలో ప్రవేశించాయి. కోదాడ, దురాచిపల్లి లాంటి ఒకటి రెండు చోట్ల మినహా ఎక్కడా నిజాం సైన్యం నుండి ప్రతిఘటన ఎదురు కాలేదు. విమానాల రొద, తుపాకుల శబ్దాలు విని పారిపోతున్న నిజాం సైనికుల్ని, రజాకార్లని ప్రజలు తరిమి తరిమి వాళ్ళ నుండి ఆయుధాలు లాక్కొని కమ్యూనిస్టు దళాలకు అప్పగించారు. దుష్టపాలన నుండి తమని రక్షించటానికే యూనియన్ సైన్యాలు వచ్చాయనుకొని ప్రజలు వారికి మంగళహారతులు పట్టి, పాలు, మజ్జిగ లాంటివి తాగించి జయ జయధ్వానాలు చేశారు. ఆ ఊపులో అనేక గడీలను, రజాకార్లు రక్షణగా ఉపయోగించుకున్న గృహాలను కూల్చి ధ్వంసం చేశారు.
నిజాం నవాబు మీర్ అలీఖాన్ ముస్లిం మతాన్ని ఉపయోగించుకొని స్వతంత్రతను కాపాడుకోవాలని ప్రయత్నించాడు. నిజానికి అప్పటికే నిజాం పాలన హైదరాబాద్ నగరానికి, మరికొన్ని పట్టణాలకు పరిమితమైంది. మరోవైపు కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో ప్రజలు అప్రతిహత విజయాలు సాధిస్తున్నారు. ఈ కారణంగా భారత సైన్యానికి నిజాం 18వ తేదీన లొంగిపోయాడు. తర్వాత జరిగిందేమిటి ?
ఎలాగూ కొట్టుకుపోయే నిజాంను, అలా కొట్టుకు పోకుండా కాపాడేందుకు భారత ప్రభుత్వం సిద్ధం అయింది. అంతవరకు పోలీస్ క్యాంపుల్లో తలదాచుకున్న భూస్వాములకు ధైర్యం వచ్చింది. వారికి సహాయపడి వారిని తిరిగి గ్రామాలకు తెచ్చారు. వారితో పాటు గ్రామాలపైబడి లూటీలు, అత్యాచారాలు చేశారు. భూస్వాముల ఆస్తులను, అధికారాన్ని పున:స్ధాపించటానికి సహకరించారు. ప్రజల నూతన జీవితాల్ని క్రూరంగా అణగదొక్కారు. అంతకు ముందే ''దక్కన్ రాజ్య రక్షణ'' పేరుతో మత ప్రాతిపదికపై ఏర్పడిన రజాకార్ల ప్రైవేటు సైన్యం సాగించిన అరాచకాలను సమర్ధవంతంగా ఎదుర్కొని, నిర్మూలించబడే పరిస్థితి నుండి వారిని రక్షించి జైళ్ళు అనే సురక్షిత స్ధావరాల్లో వుంచారు. రజాకార్ల నాయకుడు ఖాసిం రజ్వీని ప్రత్యేక విమానంలో పాకిస్తాన్ పంపించారు. నిజాం నవాబుకు ''రాజ ప్రముఖ్'' అనే బిరుదును, సంవత్సరానికి రూ. 25 లక్షలు (బియ్యం బస్తా రెండు రూపాయలు అమ్మే ఆ రోజుల్లో) రాజ భరణంగా ప్రసాదించారు. ప్రజలను దోచుకొని దాచుకున్న ఆస్తులన్నింటినీ అన్ని హక్కులతో కలిగి ఉండేట్లు అనుమతించారు. హైదరాబాద్ చుట్టుపక్కలున్న లక్షలాది ఎకరాల భూమిని అతనికి ధారాదత్తం చేశారు. రజాకార్ల నేరాలకు విచారణ కూడా లేకుండా వారిని వదిలేశారు.
ఆనాడు, ఈనాడు కూడా తెలంగాణ పోరాటం రెండు మతాల మధ్య జరిగినదిగా అసత్య ప్రచారం చేస్తూ బి.జె.పి, ఆర్.bస్.ఎస్ లు గోబెల్స్ మాదిరిగా ప్రచారానికి దిగాయి. bల్.కె. అద్వాని కేంద్ర హోంమంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణలో రథయాత్ర చేపట్టి మరీ ఈ అసత్యాన్ని ప్రచారం చేశారు. నిజానికి తెలంగాణ పోరాటంలో మతం అనే మాటే ఏనాడూ విన్పించలేదు. కాకుంటే ఉర్దూను నిర్బంధంగా రుద్దటాన్ని వ్యతిరేకించారు. తమ భాషా సంస్కృతుల్ని అభివృద్ధి చేసుకోటానికి మాత్రమే ఆంధ్ర మహాసభ ప్రయత్నించింది. మరోవైపు నిజాం ప్రభువు అతని వంది మాగధులూ హిందూ, ముస్లిం తేడా లేకుండా అందర్నీ పీడించారు, దోచుకున్నారు. మొత్తం పోరాట కాలంలో కమ్యూనిస్టు దళాల చేతిలో ఒక ముస్లిం కూడా చనిపోలేదు. పైగా నిజాం వందిమాగధుల చేత నిజాం రాష్ట్రంలో చంపబడ్డ ''బందగీ'' తొలి తెలంగాణ పోరాట అమరజీవి కావటం అనే రెండు విషయాలూ మతతత్వవాదుల ప్రచారం లోని డొల్లతనాన్ని ప్రతిబింబిస్తున్నాయి.
రక్తం చిందించకుండా ఈ విలీనం జరిగిందని భారత ప్రభుత్వం ఘనంగా ప్రకటించుకొంది. ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, వారికి నాయకత్వం వహించిన కమ్యూనిస్టు కార్యకర్తలు చిందించిన రక్తాన్ని, అనుభవించిన దౌర్జన్యాన్ని చూడటానికి నిరాకరిస్తున్నారు. ఈ పోలీస్ చర్య నిజాం నుండి ప్రజల్ని విముక్తం చేయలేదు సరికదా...ప్రజల నుండి నిజాంని, తెలంగాణ ప్రాంతంలోని ప్రజా కంటకులైన భూస్వాములకు విమోచన కల్గించింది.
''కమ్యూనిస్టుల్ని ఏరివేస్తాం'' అని ప్రకటించిన వల్లభారు పటేల్, గవర్నర్ జనరల్ రాజాజీ ప్రకటనల్ని ఆచరించి, ''పోలీసు చర్య'' అసలు ఎజెండాను బయటపెట్టారు. వేలాదిమంది ఆంధ్ర మహాసభ (సంగం) కార్యకర్తల్ని నిర్బంధించి, జైళ్ళని నరకకూపాలుగా మార్చారు. పద్నాలుగు పదిహేనేళ్ల పిల్లలకు సైతం ఉరిశిక్షలు విధించారు.
ఇన్ని ఘోరాలు చేసినా, తెలంగాణ పోరాట కాలంలో చనిపోయిన 4 వేల మంది వీరుల్లో అత్యధికం ''పోలీసు చర్య'' తర్వాతే మరణించినా, కొత్త రూపంలో దోపిడి పీడనల్ని పునరుద్ధరించినా నాటి పోరాట ఫలితాలు ఈనాటికీ తెలంగాణ జన జీవనంపై తిరుగులేని ప్రభావాన్ని కల్గించాయి. ''కాల్మొక్కుతా''ననే రైతు తలెత్తుకు నిలిచే చైతన్యాన్ని కల్గించింది.
మొత్తం మీద తేలిందేమంటే ఈ ''పోలీస్ చర్య'' ఖచ్చితంగా భూస్వాములు, దేశ్‌ముఖ్‌లు, నిజాం ప్రభువులకు ఉపయోగపడిందే తప్ప...లక్షలాది ప్రజలు మళ్ళీ పీడనకు గురయ్యారు.
''కొందరు వద్దంటే ఒప్పుకోని చరితా ముందుకు పద''.
చెరుకూరి సత్యనారాయణ










