కడప ప్రతినిధి : జిజిహెచ్ ఎమర్జెన్సీవార్డుల్లోని సెంట్రల్ ఎసి మరమ్మతుల్లో బొక్కుడు వ్యవహారం జోరుగా సాగిపోతోంది. జిల్లా ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఎంఐసియు, ఎస్‌ఐసియు, ఎన్‌ఎన్‌సియు, పిఐసియు, ఎంఎన్‌సియు ఎమర్జెన్సీ వార్డులు ఉన్నాయి. ప్రతి ఎమర్జెన్సీ వార్డుకు 40 మంది రోగుల చొప్పున 200 మందికి వైద్య సేవలు పొందుతున్నారు. ఇక్కడి రోగులకు అత్యవసర సేవలకు సంబంధించి కార్డియాలజీ తరహా ఖరీదైన వైద్య పరికరాలకు సెంట్రల్ ఎసి తప్పనిసరిగా అవసరం. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో జిజిహెచ్ పాలనా యంత్రాంగం ఎమర్జెన్సీ వార్డులకు సెంట్రల్ ఎసి సదుపాయాన్ని ఏర్పాటు చేసింది. 2015లో ఏటా రూ.15 లక్షల చొప్పున ఐదేళ్లపాటు కాంట్రాక్టు బాధ్యతల్ని ఓ ఏజెన్సీకి కట్టబెట్టారు. సదరు కాంట్రాక్టరు సెంట్రల్ ఎసికి ఎటువంటి ఆటంకాలు తలెత్తకుండా మరమ్మతులు చేయాల్సి ఉంటుంది. ఐదేళ్ల వ్యవధిలో జిజిహెచ్‌లోని ఐదు ఎమర్జెన్సీ వార్డులకు చెందిన సెంట్రల్ ఎసి పరికరాలు తరుచూ మరమ్మతులకు గురవుతున్నట్లు సమాచారం. సెంట్రల్ ఎసి పరికరాలను అనివార్యంగా తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తరుచూ సెంట్రల్ ఎసి పరికరాలు మరమ్మతులకు గురవుతున్న నేపథ్యంలో కాంట్రాక్టర్ కొత్త ఎసి పరికరాలను ఏర్పాటు చేయాలని కోరుతూ రిపోర్టును పంపించాల్సి ఉంది. కానీ కాంట్రాక్టర్ సెంట్రల్‌ఎసి పరికరాలకు తాత్కాలిక మరమ్మతులు చేపడుతూ ఏటా రూ.15 లక్షల స్థానంలో ఐదు రెట్లు అధికంగా రూ.70 నుంచి రూ.75 లక్షల చెల్లింపులతో కాంట్రాక్టు పనుల్ని కొనసాగిస్తున్నాడనే విమర్శలు వినిపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. 2020 నుంచి మూడేళ్లుగా సెంట్రల్ ఎసి మరమ్మతుల పేరుతో భారీ బొక్కుడు వ్యవహారాల్ని కొనసాగు తున్నప్పటికీ జిజిహెచ్ పాలనా యంత్రాంగం కళ్లప్పగించి చోద్యం చూస్తుండడం విస్మయాన్ని కలిగిస్తోంది. దీనిపై జిజిహెచ్ సూపరింటెండెంట్‌ను సంప్రదించగా సెంట్రల్ ఎసి కాంట్రాక్టర్ మరమ్మతులకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని కోరామని పేర్కొనడం గమనార్హం. జిజిహెచ్ పాలనా వ్యవహారాల్ని పర్యవేక్షిస్తున్న కమిషనర్ సెంట్రల్‌ఎసి మరమ్మతుల బొక్కుడుపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందనే వాదన వినిపిస్తోంది.










