Sep 29,2023 00:41

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : అవయవ దానానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ జీవన్‌ ప్రదీప్‌ అన్నారు. ఆసుపత్రి ఆవరణలో గురువారం అవయవ దానం ఆవశ్యకత గురించి ఫార్మాసి, నర్సింగ్‌ విద్యార్థిని విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ జీవన్‌ ప్రదీప్‌ మాట్లాడుతూ అవయవ దానాలపై అనేకమందికి అనేక రకాలుగా అనుమానులు కలుగుతున్నాయని, ప్రజల్లో అవగాహన పెరగాలని అన్నారు. ప్రజల్లో ఉన్న భయాందోళనలు, సెంటిమెంట్‌లకు దూరంగా ఉండాలని సూచించారు. సెంటిమెంట్‌లకు కాలం చెల్లె విధంగా నిర్ణయాలు తీసుకోవాలని, అవయవదానం గురించి ప్రజల్లో చైతన్యం తీసుకుని వచ్చేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని సూచించారు. జిజిహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కిరణ్‌ కుమార్‌ మాట్లాడుతూ దేశంలో 5 నుండి 10 లక్షల మంది అవయవాల కోసం ఎదురు చూస్తున్నారని, వీటి కొరత తీరాలంటే అవయవదానం అవసరాన్ని అందరూ గుర్తించాలని అన్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రిలో గుండె మార్పిడి శస్త్ర చికిత్సలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో లివర్‌ మార్పిడి శస్త్ర చికిత్సలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. లివర్‌ మార్పిడి శస్త్ర చికిత్సలను చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ డిఎస్‌ఎస్‌ శ్రీనివాసప్రసాద్‌, సివిల్‌ సర్జన్‌ ఆర్‌ఎంఒ డాక్టర్‌ సతీష్‌ కుమార్‌, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ ఆశా సజని, అడ్మినిస్ట్రేటర్‌ ప్రవీణ్‌ కుమార్‌ పాల్గొన్నారు.
రేబిస్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలి
రేబిస్‌ వల్ల మరణాలూ సంభవిస్తు న్నాయని, ప్రాణంతక రేబిస్‌ వ్యాధి సోకకుండ తగు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్‌ కిరణ్‌ కుమార్‌ సూచించారు. గురువారం ఆసుపత్రిలో ప్రపంచ రేబిస్‌ దినోత్సవం సందర్బంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కుక్క కాటు తీవ్రంగా పరిగణంచి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. సొంతంగా వైద్యం చేసుకోకుండా వైద్యుల సలహాలు పాటించాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ శ్రావణ్‌ బాబు మాట్లాడుతూ కుక్క కరిచిన వెంటనే వైద్యుల సలహా తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ కార్మికులకు రేబిస్‌ నివారణ ఇంజెక్షన్లు చేశారు.