Aug 20,2023 20:24

ధర్నా చేస్తున్న దృశ్యం

ప్రజాశక్తి-నెల్లూరు :సెప్టెంబర్‌ మొదటి వారంలో నిర్వహించతలపెట్టిన జి -20 దేశాల సమ్మిట్‌ నేపథ్యంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఢిల్లీలోని సూర్జిత్‌ భవన్‌లో ప్రముఖ ఆర్థిక వేత్తలు, మేధావులు,ప్రముఖ పాత్రికేయులు, రాజకీయవేత్తలు కలిసి నిర్వహిస్తున్న సెమినార్‌ను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నిరంకుశంగా అడ్డుకోవడాన్ని నిరసిస్తూ నగరంలో సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఆదివారం బాలాజీ నగర్‌లోని సిపిఎం కార్యాలయం నుంచి మినీ బైపాస్‌ వద్దనున్న జ్యోతిరావు ఫూలే విగ్రహం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ ఢిల్లీలో జి20 దేశాల సమ్మిట్‌ సందర్భంగా 3 రోజులు పాటు ప్రజా సంఘాలు నిర్వహిస్తున్న సెమినార్‌ను నిరంకుశంగా సూర్జిత్‌ భవన్‌ కు తాళాలు వేసి పోలీసు బలగాలతో బిజెపి ప్రభుత్వం అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య అన్నారు. భారతదేశంలో ప్రతి పౌరుడు స్వేచ్ఛగా తమ అభిప్రాయాన్ని తెలియజేసే వాక్‌ స్వాతంత్య్ర హక్కు కలిగి ఉన్నారన్నారు. బిజెపి ప్రభుత్వం నిరంకుశ,నియంతత్వ విధానాలను అవలంబించడం సిగ్గుచేటన్నారు. బిజెపి అవలంబిస్తున్న నిరంకుశ వైఖరిని ప్రతి ఒక్కరు ఖండించాలని పిలుపు నిచ్చారు. సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు జి. నాగేశ్వరరావు, పి. సూర్యనారాయణ, నగర కమిటీ సభ్యులు బీపీ నరసింహ, కత్తి పద్మ,మూలం ప్రసాద్‌,ఆర్‌ నగేష్‌, చిరంజీవి, ఎన్‌.వి సుబ్బమ్మ, చెంగయ్య, శాఖా కార్యదర్శులు అల్లంపాటి. శ్రీనివాసులు రెడ్డి, వెంకటేశ్వర్లు, మల్లీశ్వరి, ఫయాజ్‌, రవుఫ్‌, బాబురావు పాల్గొన్నారు.