ప్రజాశక్తి-వేటపాలెం: 216 జాతీయ రహదారి. స్థానిక డిగ్రీ కాలేజ్ జంక్షన్ వద్ద మండల రక్షణ నిలయం అధికారి ఎండకు పుచ్చకాయ ముక్క తింటూ సేదతీరుతున్నారు. జంక్షన్ నుంచి వేటపాలెం కుందేరు మార్కెట్ రోడ్డు వైపు బైక్‌పై విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ రివ్వున దూసుకెళుతున్నారు. బైక్ వెనుక మండల ఇన్‌ఛార్జి తహశీల్దారు, చీరాల రెవెన్యూ డివిజినల్ అధికారి కార్లు ఒకదాని వెనుక ఒకటి పరుగులు తీస్తున్నాయి. శనివారం మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలకు జంక్షన్ వద్ద సేదతీరుతున్నా అధికారితో మాట్లాడుతున్న ప్రజాశక్తికి ఈ దృశ్యం అగుపించింది. రంజాన్ పండుగ సెలవు రోజున ఈ అధికార్ల ఉరుకులు, పరుగుల గురించి ఆరా తీసేందుకు ప్రయత్నించింది. సెలవు రోజు కూడా విశ్రాంతి లేకుండా ఈ అధికారులు పనులను చక్కదిద్దు కొంటున్నారు. విషయం ఏమిటని ఆరా తీస్తే రామన్నపేట పంచాయతీ ఇందిరా కాలనీ పరిధిలోని ఇండిస్టియల్ ఏరియాలో ఒక వ్యక్తికి ల్యాండ్ కన్‌వర్షన్ కోసం వచ్చిన అర్జీని పరిశీలన నిమిత్తం వచ్చినట్లు తహశీల్దారు గరిక మహేశ్వరి ప్రజాశక్తికి ఫోన్‌లో బదులిచ్చారు. ఆర్‌డిఒకు ఫోన్ కాల్ రావడంతో వెను తిరిగారని వివరించారు. ఆర్‌డిఓ సరోజిని స్థలం పరిశీలించకుండానే వెనుతిరగడం పట్ల అర్జీదారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సెలవు రోజు అందుబాటులో ఉన్న తహశీల్దారు కార్యాలయ అనధికార విధులు నిర్వహించే గ్రామ నౌకరు, ఇన్‌ఛార్జి ఆర్‌ఐలకు మండల, డివిజనల్ అధికారుల ఆదేశాలు పాటిస్తూ ముందుకుసాగారు. పని దినాల్లోనే కాకుండా సెలవు రోజుల్లో కూడా సామాన్యుల ల్యాండ్ కన్‌వర్షన్ అర్జీల పరిష్కారానికి పనిగట్టుకొని అధికార యంత్రాంగం కదిలి రావడం పట్ల ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. తాము కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా పనులు కావడం లేదని సామాన్యులు ముక్కున వేలేసుకోవడం విశేషం.










