Nov 05,2022 23:46

మాట్లాడుతున్న డిఎస్పీ సునీల్‌

ప్రజాశక్తి-రోలుగుంట:రోలుగుంట మండలం పడాలపాలెంలో గత నెల 16న 13 ఏళ్ల బాలుడిని సెల్‌ఫోన్‌ కోసం హత్య చేసిన నిందితుడిని అరెస్టు చేసినట్లు అనకాపల్లి డిఎస్పీ సునీల్‌ తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక పోలీస్‌ స్టేషన్‌ వద్ద విలేకర్లతో డిఎస్‌పి మాట్లాడుతూ, మాకవరపాలెం మండలం తాడపాల గ్రామానికి చెందిన నిందితుడు గనిశెట్టి వెంకటసూర్యనాగేశ్వరరావును అరెస్టు చేయడం జరిగిందన్నారు. నిందితుడు మొబైల్‌ ఫోన్‌ కోసం బాలుడిని హత్య చేసి పరారయ్యాడన్నారు. 20 రోజులుగా తప్పించుకొని తిరుగుతున్న నిందితుని కోసం ఐదు ప్రత్యేక బృందాలు గాలించి ఎట్టకేలకు పట్టుకోకున్నామని తెలిపారు. ఈ నెల 16న పడాలపాలెం గ్రామానికి చెందిన పడాల సురేష్‌(13) గేదెలను మేపడానికి పొలాల్లోకి వెళ్లాడని, సాయంత్రారనికి గేదెలు ఇంటికి చేరాయి. కానీ, సురేష్‌ ఇంటికి రాలేదని తెలిపారు. తాడపాల గ్రామానికి చెందిన నిందితుడు నాగేశ్వరరావు అదే రోజున పడాలపాలెం పొలాల్లోకి వెళ్లాడంని, అదే సమయంలో గేదెలు మేపుతున్న సురేష్‌ వద్ద సెల్‌ఫోన్‌ చూశాడని తెలిపారు. ఆ సెల్‌ఫోన్‌ ఇవ్వమని నాగేశ్వరరావు అడగటంతో ఇవ్వక పోవడంతో పక్కనే ఉన్న జీడితోటల్లోకి తీసుకువెళ్లి మెడకు వైరు చుట్టి హత మార్చినట్లు నిర్ధారణ అయిందన్నారు. గేదెలను మేపడానికి పొలాల్లోకి వెళ్లిన సురేష్‌ ఇంటికి రాక పోవడంతో కంగారుపడిన తల్లిదండ్రులు గ్రామంలో వెతికారన్నారు. సమీప తోటలో సురేష్‌ను హత్య చేసి పడేసినట్లు తెలియడంతో వెంటనే తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారన్నారు. దీంతో, దర్యాప్తు చేపట్టామని, ఐదు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి 15 రోజులుగా శ్రమించి 4వ తేదీన తిరుపతిలో నిందితుడు నాగేశ్వరరావును అదుపులో తీసుకున్నామని తెలిపారు.అతన్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. ఈ సమావేశంలో కొత్తకోట సిఐ సయ్యద్‌ అహ్మద్‌ ఇలియాజ్‌, రోలుగుంట ఎస్సై నాగకార్తీక్‌ ఉన్నారు.