ప్రజాశక్తి -తగరపువలస : సేల్ఫీ ఛాలెంజ్‌లు కాదు, తమ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం కావాలని టిడిపి నేతలకు స్థానిక ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు సవాల్ విసిరారు. భీమిలి మండలం టి.నగరపాలెంలో కమ్యూనిటీ హాల్ నుంచి ఎల్లారమ్మ గుడి వరకు గోస్తనిపై వంతెన నిర్మాణానికి చిప్పాడ దివీస్ రూ.2.98 కోట్లు ఆర్థిక సాయం చేయడంతో ఆ పనులకు ఎమ్మెల్యే ఆదివారం భూమి పూజ చేశారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, 1520 మంది ఓటరున్న టి.నగరపాలెం పంచాయతీలోనే 4ఏళ్ల కాలంలో ప్రభుత్వం రూ.11 కోట్లతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని వివరించారు. దివీస్ ఆధ్వర్యాన ఇదే పంచాయతీలో ఇప్పటికే రూ. 3.38 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. తగరపువలసలో ఆర్టీసీ బస్సు కాంప్లెక్స్ ఏర్పాటుచేయడం తధ్యమని నొక్కి చెప్పారు.
సభకు అధ్యక్షత వహించిన సర్పంచ్ పొట్నూరు ఛాయా గౌతమి మాట్లాడుతూ, 2022 ఫిబ్రవరిలో ఇదే వంతెన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రభుత్వ పరంగా సాంకేతిక పరమైన ఆమోదం లభించడంలో ఆలస్యమైనందున వంతెన నిర్మాణ పనులు ప్రారంభం కాలేదని తెలిపారు. దీంతో స్థానికుల నుంచి విమర్శలు ఎదురయ్యాయన్నారు. 9నెలల వ్యవధిలో పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను కోరారు. ఈ సభలో ఎంపిపి డివిఎస్‌ఎస్‌ఎన్.రాజు, జడ్‌పిటిసి సభ్యులు గాడు వెంకటప్పడు, ఎంపీటీసీ సభ్యులు పల్లా నీలిమ, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ పెదబాబు, ఎఎంసి చైర్మన్ యలమంచిలి సూర్యనారాయణ, వైస్ ఎంపిపి బి.బంగారునాయుడు, దివీస్ సంస్థ సలహాదారు వరహాలరెడ్డి, సిఎస్‌ఆర్ అధికారి నాగరాజు, ఎండిఒ పి.వెంకటరమణ, ఇఒపిఆర్‌డి శంకర్ జగన్నాధ్ తదితరులు పాల్గొన్నారు.










