ప్రజాశక్తి-సబ్బవరం
విద్యార్థుల విజ్ఞాన అభివృద్ధికి సెల్ఫ్ ఎవల్యూషన్ అండ్ లెర్నింగ్ ఫర్ ఫ్యూచర్ (సెల్ఫ్) అనే ఆన్‌లైన్ ప్రోగ్రామంను రూపొందించిన మండలంలోని నంగినారపాడు జెడ్‌పి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు పి.శ్రీనివాసరావు, ఎన్.సోమేశ్వరరావును జిల్లా కలెక్టర్ రవి పట్టాన్ శెట్టి అభినందించారు. మంగళవారం కలెక్టర్ నంగినారపాడు ఉన్నత పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో విద్యార్థులను స్వీయ అభ్యాసం- స్వీయ మూల్యాంకనం వైపు ప్రోత్సహించే విధంగా సెల్ఫ్ ప్రోగ్రామును రూపొందించినట్లు ఉపాధ్యాయులు తెలిపారు. ఈ ఆన్‌లైన్ ప్రోగ్రాం ద్వారా విద్యార్థులు క్లిష్టమైన అంశాల సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు. దీనిని ఎప్పుడైనా, ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చని, ఎస్‌ఎస్‌సి పరీక్షలకు సిద్ధమయ్యేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు. దీనిని పరిశీలించిన కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల బోధనలో వేగంగా క్షుణ్ణంగా తెలుసుకునేందుకు ప్రత్యేక సరళిని రూపొందించడం అందరికీ ఎంతో మేలు చేస్తుందని చెప్పారు. వరుసగా అడిగే ప్రశ్నలకు ముందు జవాబు చెప్పిన తరువాతే తదుపరి ప్రశ్న వస్తుందని, చెప్పనట్లయితే దానిని గురించి వివరించే వీడియో వచ్చే విధంగా సిద్ధం చేసినట్లు తెలిపారు. దీని మూలంగా విద్యార్థి క్లిష్టమైన అంశాలను నేర్చుకోవచ్చని, క్షుణ్ణంగా తెలుసుకోవచ్చని చెప్పారు. ఈ టూల్‌ను ఉపయోగించడానికి ఎటువంటి ''సాఫ్ట్ వేర్'', ''యాప్'' డౌన్లోడ్ చేసుకోవలసిన అవసరం లేదని, పిడిఎఫ్ ద్వారా వినియోగించుకోవచ్చని చెప్పారు. పాఠశాల, మండల, జిల్లా స్థాయిలలో పర్యవేక్షణ చేయడానికి అనువైన ''డాష్ బోర్డు''ను కూడా రూపొందించారని తెలిపారు. ఇటువంటి సాఫ్ట్ వేర్‌ను తయారు చేసిన ఉపాధ్యాయులను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఈ పర్యటనలో మండల విద్యాధికారి ఎస్.అప్పలరాజు పాల్గొన్నారు.










