ప్రజాశక్తి-హుకుంపేట:మండలంలోని మారుమూల గ్రామాలకు సెల్ సిగ్నల్స్ అందక పోవడంతో గిరిజనులు అవస్థలు పడుతున్నారు. సిగ్నల్స్ లేకపోవడంతో అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఆన్లైన్ చేస్తుంటారు. సరైన సమయానికి సిగ్నల్స్ అందక పోవడంతో యువతీ, యువకులు తీవ్రంగా నష్ట పోతున్నారు. ప్రభుత్వం నుంచి అందించే పథకాలు ఆన్లైన్ చేసుకోవాలన్న, నెల వారి పింఛన్లు, థంబు వేయాలనా సిగ్నల్స్ లేక పోవడంతో తాము నష్టపోతున్నామని బూర్జ, గత్తుం, శోభకోట, పాతకోట, సంతారి, చికుమధుల, జార్ర కొండ, గన్నేరుపుట్టు, అండిభ, దుర్గం, రాప, తదితర పంచాయతీల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. సిగ్నల్ లేని పంచాయతీల్లో సచివాలయం సేవలు అందలేదన్నారు. మారుమూల ప్రాంతాల్లో గిరిజనులు అనారోగ్యానికి గురైతే కనీసం 108కు ఫోన్ చేసే అవకాశం లేకపోవడంతో సమయానికి ఆసుపత్రికి చేరలేక పోతున్నామని వారు తమ గోడు వెలదీసుకున్నారు. ఏజెన్సీలో మంజూరైన సెల్ టవర్లు వేగవంతంగా నిర్మాణం చేసి సిగ్నల్ సౌకర్యం అందించాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.










