
సెల్ ఫోన్ల్ చోరీలో కంటైనర్ డ్రైవర్ ప్రధాన సూత్రదారి
- 184 సెల్‌ఫోన్లు, రెండు మారుతీ స్విప్ట్ కార్లు, మూడున్నర కిలోల గంజాయి స్వాధీనం
- కేసును చేధించిన పోలీస్ సిబ్బందికి ఎస్‌పి అభినందన
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
ఫ్లిప్ కార్ట్‌కు చెందిన సెల్ ఫోన్‌లను, రెండు మారుతీ స్వీఫ్ట్ కార్లను, మూడున్నర కిలోల గంజాయిను అంతరాష్ట్ర దొంగల ముఠా నుండి స్వాధీనం చేసుకుని రికవరీ చేసినట్లు జిల్లా ఎస్పీ కె. రఘువీర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ పలు విషయాలు వెల్లడించారు. సెల్ ఫోన్‌లు కొట్టేయడంలో కంటైనర్ డ్రైవర్ నయిం ప్రధాన సూత్రదారుడని తేలిందన్నారు. ఐటిఎస్ మేనేజర్ బల్జిత్ సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. ఐటిఎస్ కంపెనీలో పని చేస్తున్న వాహిద్ ఖాన్, హర్యానా రాష్టంలోని కొందరు వ్యక్తులను పరిచయం చేసుకుని హైదరాబాద్‌కు చెందిన సునీల్‌తో కలిసి హర్యానాలోని గురుగ్రామ్ జిల్లాలోని ఫ్లిప్ కార్ట్ గోడౌన్ నుండి బెంగళూరు ఫ్లిప్‌కార్ట్ గోడౌన్‌కు బయలు దేరిన ఐటిఎస్ కంపెనీ కంటైనర్‌లోని మొబైల్ ఫోన్‌లను గత నెల 10, 11వ తేదీలలో రాత్రి ఆదిలాబాద్ దగ్గరలోని హైవే పక్కన కంటైనర్‌ను ఆపి అందులోని 722 సెల్‌ఫోన్‌లను సంచులలో మూటలు కట్టి కంటైనర్‌ను ఆపి అక్కడ నాయింకు చెందిన కారులో, సునీల్‌కి చెందిన కారులో వేసుకుని, కంటైనర్‌ను బెంగళూరుకు తీసుకెళ్లి వదలిపెట్టి వెళ్లారని తెలిపారు. గత నెల మెయిన్ డ్రైవర్ వాహిద్ ఖాన్, నయిం, ఇతర గ్యాంగ్ సభ్యులు కొన్ని సెల్ ఫోన్‌లను సునీల్ ఇంట్లో పెట్టి మిగతావి మారుతీ స్వీఫ్ట్ కారులో మహేంద్ర ధార్ వెహికిల్ హర్యానాకు తీసుకెళ్లారని చెప్పారు. ఈ సంఘటనలో పోలీసులు బృందాలుగా నిందితుల కోసం గాలిస్తుండగా శుక్రవారం బెంగళూరు ఎన్ హెచ్-44లోని డోన్ మండలం తాటిమాను కొత్తూరు గ్రామం ఊరి బయట మేవత్ దాబా ముందు ముగ్గురు వ్యక్తులు వాహిద్, షరీఫ్ ఖాన్, సునీల్ బాను దాస్‌లు రెండు మారుతీ స్వీఫ్ట్ కార్లు పెట్టుకొని అనుమానస్పదంగా ఉండగా వారిని డోన్ రూరల్ ఎస్‌ఐ, పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించినట్లు చెప్పారు. వారు చేసిన నేరం ఒప్పుకున్నట్లు తెలిపారన్నారు. వారి వద్ద ఉన్న మూడున్నర కిలోల గంజాయిను, 184 సెల్ ఫోన్‌లు, రెండు స్వీఫ్ట్ కార్లను స్వాధీనం చేసుకోని నిందుతులను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ కేసును చేధించడంలో, నేరస్థులను పట్టుకొనుటలో తీవ్ర ప్రయత్నం చేసిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ జి.వెంకట రాముడు, డోన్ డీఎస్పీ వై. శ్రీనివాస రెడ్డి, డోన్ రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్‌ఐ సుధాకర్ రెడ్డి, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సీఐ షాదీక్ అలీ, సీసీఎస్ రామకృష్ణ, ఎస్‌ఐ రాకేష్ తదితరులు పాల్గొన్నారు.