Nov 29,2021 07:34

భవిష్యత్తులో లక్ష్యాలను ఏర్పరుచుకునే అలవాటు ఉన్నవారు, ఆ గమ్యాలను చేరేందుకు నిరంతరం కృషి చేస్తుంటారు. సినిమాల్లో నటించాలి అనుకునేవారు సైతం ఇందుకు మినహాయింపు కాదు. అయితే నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వారు ఇండిస్టీలో ప్రభావం చూపడం అరుదు. రంగుల ప్రపంచమే జీవితంగా బతకాలనుకొని, మధ్యలో వెనక్కు వెళ్లిన యువకులు ఎందరో ఉన్నారు. కానీ బీహార్‌కు చెందిన జమీల్‌ షా విషయంలో మాత్రం ఇలా జరగలేదు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఆయన.. బాలీవుడ్‌కు దగ్గరగా ఉండాలని మాత్రమే కలలు కన్నాడు. ఈ కల కోసం కూలీగా, సెక్యూరిటీ గార్డుగానూ పనిచేశాడు. ఇప్పుడు బాలీవుడ్‌ ప్రముఖులకు డ్యాన్సింగ్‌ షూస్‌ డిజైన్‌ చేసే స్థాయికి ఎదిగాడు. అనేకమందికి స్ఫూర్తిని కలిగించే ఆ విశేషాలు తెలుసుకుందాం..!

 

సెక్యూరిటీ గార్డు నుంచి బాలీవుడ్‌ స్థాయికి..!



     మీల్‌ షా చిన్నప్పటి నుంచే ముంబై చేరుకోవాలని కలలు కన్నాడు. అయితే తాను స్టార్‌ కావాలని ఎప్పుడూ అనుకోలేదు. బాలీవుడ్‌ హీరోలను దగ్గరగా చూడటం, వారితో ఫొటోలు దిగి దాచిపెట్టుకోవడం, వాటిని చూపిస్తూ స్నేహితుల వద్ద గొప్పలు చెప్పుకోవడం మాత్రమే అతడికి ఇష్టం. ఇలా తన ఇష్టం కోసం 14 ఏళ్ల వయసులో, రెండు దశాబ్దాల క్రితం ముంబైలో అడుగుపెట్టాడు జమీల్‌.
     హీరోలను చూడాలనే లక్ష్యంతో ముంబైకి వచ్చిన ఈ వ్యక్తి.. ప్రస్తుతం బాలీవుడ్‌ ప్రముఖుల కోసం డ్యాన్స్‌ షూస్‌ డిజైన్‌ చేస్తున్న ప్రముఖ షూ మేకర్‌. ఇప్పుడు బాలీవుడ్‌ అతడి షూతో డ్యాన్స్‌ చేస్తుందని జమీల్‌ సన్నిహితులు గర్వంగా చెప్పుకుంటున్నారు. కానీ ఈ ప్రయాణంలో అతడు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు. ముంబైకి రాకముందు ఢిల్లీలో కూలీగా పనిచేశాడు. ముంబై వెళ్లాలనే లక్ష్యంతో ఒకరోజు రైలు ఎక్కాడు. అక్కడ బతకడానికి చిన్నపాటి ఉద్యోగాలు చేశాడు.
    బాలీవుడ్‌ తారలను కలవాలనే కోరికతోనే జమీల్‌ ముంబైలో ఏదో ఒక పని చేస్తుండేవాడు. అయితే హీరోల వద్దకు తీసుకెళ్తానని నమ్మించిన అతడి స్నేహితుడు తనను మోసగించి రూ.25,000 కాజేశాడు. బాలీవుడ్‌ తారలతో సమావేశం ఏర్పాటు చేయాలనే నెపంతో ఆ వ్యక్తి బెంగళూరు పారిపోయాడు. ఇదంతా మోసం అని జమీల్‌ త్వరగానే అర్థం చేసుకున్నాడు. స్నేహితుడి కోసం వెతకడం అనవసరం అనుకున్నాడు. తిరిగి ముంబై వెళ్లడానికీ డబ్బులు లేకపోడంతో బెంగళూరులోనే సెక్యూరిటీ గార్డ్‌గా పని చేశాడు. ఎదురుదెబ్బలు, వైఫల్యాలతో జమీల్‌ నిరుత్సాహపడలేదు. మరోసారి ముంబైకి చేరుకొని బాలీవుడ్‌ స్టార్స్‌ను కలవడంతో పాటు వారితో డ్యాన్స్‌ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇందుకు ఇంగ్లీష్‌ కూడా నేర్చుకున్నాడు. తరువాత ధారావిలోని లెదర్‌ యాక్సెసరీస్‌ తయారీ యూనిట్‌లో పనిచేశాడు. ఈ క్రమంలో లాటిన్‌, ఇటాలియన్‌ డ్యాన్స్‌ క్లాసులు నిర్వహించే కొరియోగ్రాఫర్‌ సందీప్‌ సోపార్కర్‌ పోస్టర్‌ చూశాడు. పోస్టర్‌లో వివిధ డ్యాన్స్‌ స్టైల్స్‌ చూసిన జమీల్‌, వాటికి ఆకర్షితుడయ్యాడు. ఆ వెంటనే కూడబెట్టుకున్న డబ్బుతో సందీప్‌ డ్యాన్స్‌ స్కూల్లో చేరాడు. డబ్బున్న వాళ్ల పిల్లలతో కలిసి డ్యాన్స్‌ నేర్చుకునేందుకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. కష్టపడి డ్యాన్స్‌ నేర్చుకున్న జమీల్‌, రియాలిటీ షోల్లో కూడా డ్యాన్స్‌ చేశాడు.

 

సెక్యూరిటీ గార్డు నుంచి బాలీవుడ్‌ స్థాయికి..!


    అయితే అప్పటికే లెదర్‌ ఉత్పత్తుల తయారీలో పట్టు సాధించిన జమీల్‌.. డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ కోసం సొంతంగా షూస్‌ డిజైన్‌ చేసుకున్నాడు. ఈ విషయం సందీప్‌కూ తెలుసు. ఒకరోజు కొరియోగ్రాఫర్‌ సందీప్‌ జమీల్‌కు కాల్‌ చేశారు. కొన్ని జతల బూట్లు తీసుకొని, తన ఇంటికి రమ్మని సందీప్‌ చెప్పాడు. ఎప్పటిలాగే వెళ్లిన జమీల్‌.. అక్కడ ఉన్న వ్యక్తులను చూసి ఆశ్చర్యపోయాడు. కొరియోగ్రాఫర్‌ ఫరా ఖాన్‌, కాజోల్‌, అమీషా పటేల్‌, సోనాలి బింద్రే అక్కడ ఉన్నారు. డ్యాన్స్‌ షూస్‌ చేసే వ్యక్తిగా జమీల్‌ను వారికి పరిచయం చేశాడు సందీప్‌. అతడు రూపొందించిన షూస్‌ వారందరికీ నచ్చాయి. ఇలా ప్రముఖుల ప్రశంసలతో పాటు ఆర్డర్లు సైతం ఒకేసారి వచ్చాయని చెబుతున్నాడు జమీల్‌.
   ఇలా కొద్ది కాలంలోనే జమీల్‌ పేరు బాలీవుడ్‌లో అందరికీ తెలిసింది. డ్యాన్స్‌ షూస్‌ డిజైనర్‌గా అతడి ఫోన్‌ నంబర్‌ ప్రముఖులకు పరిచయమైంది. ఇప్పుడు అతడికి బాలీవుడ్‌ ప్రముఖుల నుంచి కస్టమ్‌ మేడ్‌ షూస్‌ డిజైన్‌ కోసం ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయి. అమీర్‌ఖాన్‌ నుంచి రణవీర్‌సింగ్‌ వరకూ, ప్రియాంక చోప్రా నుంచి నోరా ఫతేహి వరకూ చాలామంది బాలీవుడ్‌ స్టార్స్‌ కోసం జమీల్‌ బూట్లు తయారుచేశాడు.
   కేవలం బాలీవుడ్‌ మాత్రమే కాదు, జమీల్‌ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. గతంలో భారత పర్యటనకు వచ్చిన పాప్‌ సింగర్‌ షకీరా.. జమీల్‌ డిజైన్‌ చేసిన షూస్‌ ధరించి, అతడిని ప్రశంసించింది. బార్బరా మూర్‌, ఆస్ట్రేలియన్‌ సింగర్‌, యాక్టర్‌ కైలీ మినోగ్‌ వంటి ప్రముఖులు ఇప్పుడు జమీల్‌ క్లయింట్ల జాబితాలో ఉన్నారు.
    అలా చిన్న తయారీ యూనిట్‌లో మొదలైన అతడి ప్రస్థానం.. ఇప్పుడు డజను కంటే ఎక్కువ మందికి ఉపాధి కల్పించడం వరకూ వెళ్లింది. బాంద్రాలో ఒక షోరూమ్‌, ముంబైలో సొంత ఇంటిని నిర్మించుకున్న ఈ వ్యాపారి.. చిన్నప్పటి నుంచి కన్న కలను ఎట్టకేలకూ సాకారం చేసుకున్నాడు. ప్రస్తుతం 40 ఏళ్ల వయసున్న జమీల్‌.. తాను డిజైన్‌ చేసిన షూస్‌ ధరించిన ప్రముఖుల ఫొటోలను ప్రపంచానికి గర్వంగా చూపిస్తున్నాడు.