Nov 10,2023 21:11

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ గిరీష

రాయచోటి : ఎన్నికల్లో సెక్టోరల్‌ అధికారుల పాత్ర కీలకమని, వారి కేటాయింపులో జాప్యం ఉండ కూడదని, పోలింగ్‌ కేంద్రాల వారీగా ఇపి రేషియో, జెండర్‌ రేషి యోలలో తప్పులు ఉండరాదని కలెక్టర్‌ గిరీష సంబంధిత అధికారులను ఆదేశించారు. సెక్టోరల్‌ అధికారుల కేటా యింపు, రూట్‌ మ్యాపులు, లాజిస్టిక్‌ అవసరాలు, శిక్షణ, పోలింగ్‌ కేంద్రాల హేతుబద్ధీకరణ, ఇబ్బందికర కేంద్రాల గుర్తింపు, ఇపి రేషియో, జెండర్‌ రేషియో, నియోజకవర్గ ఎన్నికల మేనేజ్మెంట్‌, ప్రత్యేక ప్రచార రోజులు, ఎన్నికలకు సంబంధించిన ఫారం లను త్వరగా క్లియర్‌ చేయ డం వంటి అంశాలపై శుక్రవారం మధ్యాహ్నం ఆర్‌డిఒలు, తహశీల్దార్లు, ఎంపిడిఒలతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెక్టోరల్‌ అధికారుల కేటాయింపుకు సంబంధించిన ప్రతిపాదనలు కొన్ని నియోజకవర్గాల నుంచి రాలేదని, వాటిని త్వరగా పంపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఒక్కొక్క సెక్టోరల్‌ అధికారికి 6 పోలింగ్‌ స్టేషన్ల కంటే ఎక్కువగా కేటా యింపు ఉండకూడదని సూచించారు. ఒక్కొక్క రూటుకు ఒక్కొక్క సెక్టోరల్‌ అధికారిని కేటాయించేలా చూసుకోవాలని సూచించారు. వచ్చే మంగళవారానికల్లా సెక్టోరల్‌ అధికారుల కేటాయింపు పూర్తవ్వాలని ఆదేశించారు. లాజిస్టిక్‌ అవసరాలకు గురించి మాట్లాడుతూ... వాహ నాల కేటాయింపు తదితర అంశాలను కూలంకషంగా పరిశీలించి తగిన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.రాజకీయ పార్టీలతో సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని, వారికి ఏ ఏ పోలింగ్‌ కేంద్రాలలో ఇబ్బందులు ఉన్నాయో అడిగి తెలుసుకుని తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇపి రేషియో మరియు జెండర్‌ రేషియోలలో ఎటువంటి తప్పులు లేకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చనిపోయిన వారి ఓట్లు, డబుల్‌ ఎంట్రీలు ఉండకూడదని ఆదేశించారు. బిఎల్‌ఒల సహకారంతో తహశీల్దార్లు, ఇఆర్‌ఒలు ఓటర్ల జాబితాలో తప్పులు లేకుండా చూసుకోవాలన్నారు. నియోజకవర్గ ఎన్నికల మేనేజ్మెంట్‌ లోని వివిధ అంశాలను పక్కాగా అమలు పరచాలని అధికారులను ఆదేశించారు. ఓటర్ల జాబితా పై ప్రత్యేక శిబిరాల గురించి వీధుల్లో టామ్‌ టామ్‌ చేయించాలని,ప్రజలందరికీ తెలిసేలా ప్రచారం జరగాలని ఆదేశించారు. సమీక్ష సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌, డిఆర్‌ఒ సత్యనారాయణ, ఎన్నికల సెల్‌ అధికారులు పాల్గొన్నారు.