ప్రజాశక్తి-అచ్యుతాపురం
ఎస్‌ఇజెడ్‌లోని పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యాన గురువారం అచ్యుతాపురం రహదారులపై నిరసన ర్యాలీ చేశారు. ఫార్మా పరిశ్రమలలో జరిగే ప్రమాదాలను అరికట్టాలని, దీనికి కారణమైన యాజమాన్యాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్.రాము, మండల కార్యదర్శి కె.సోమినాయుడు మాట్లాడుతూ అచ్యుతాపురం ఎస్‌ఇజెడ్‌లోని ఫార్మా, ఇతర పరిశ్రమల్లో వేలాది మంది కార్మికులు పని చేస్తున్నారని, వారి ప్రాణాలకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం, యాజమాన్యాలు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నాయని తెలిపారు. ఎటువంటి భద్రత ప్రమాణాలు పాటించడం లేదన్నారు. ప్రమాదాల సంభవించే సమయాల్లో అరకొరగా పరిహారం చెల్లించి చేతులు దులుపుకుంటున్నారు తప్పా ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం లేదని చెప్పారు. ప్రమాదాల నివారణకు అన్ని పరిశ్రమలలో సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని, ఆ నివేదికలు బయట పెట్టాలని, భద్రతా ప్రమాణాలు పాటించని యాజమాన్యాలను అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎ.వినరు, కె.శంకర్రావు, కె.శ్రీను, ఎస్.సత్యారావు, కార్మికులు పాల్గొన్నారు.










