ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: జిల్లాగా ఏర్పడిన ఏడాది కాలంలోనే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు, ప్రజలకు సేవలందించడంలో బాపట్ల జిల్లా 5వ స్థానంలో నిలిచేలా అధికారులు చేసిన కృషిని జిల్లా కలెక్టరు విజయకృష్ణన్ అభినందించారు. స్థానిక కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం స్పందన కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ వినతి పత్రాల ద్వారా కలెక్టరును వేడుకున్నారు. 90 అర్జీలు నమోదయ్యాయి. వినతులపై స్పందించిన కలెక్టరు తక్షణమే పరిష్కారమార్గం చూపారు. కొన్నింటిని ఆయా శాఖల అధికారులకు పురమాయించగా మరికొన్నింటిని విచారణ, పరిశీలనకు ఆదేశించారు. తనపరిధిలో లేని వాటిని ప్రభుత్వానికి సిఫారసు చేశారు. స్పందన అర్జీలపై అన్ని శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.
ప్రజలకు సేవలందించడంలో బాపట్ల జిల్లా మిగిలిన అన్ని జిల్లాలతో పోటీపడుతోందని కలెక్టరు చెప్పారు. మౌలిక సదుపాయాలు లేకపోయినా అధికారులు చిత్తశుద్ధితో పనిచేశారని ప్రశంసించారు. లోపాలను అధిగమిస్తూ దిగువ స్థానంలో ఉన్న బాపట్ల జిల్లా ముందుకు సాగేలా అధికారులు నిరంతరం కృషి చేస్తున్నారని వివరించారు. నూతనంగా ఏర్పడిన జిల్లాలో పూర్తిస్థాయిలో వనరులు లేకపోయినప్పటికీ అభివృద్ధి వైపు అడుగులు వేసేలా మీరందించిన సహకారం, ప్రోత్సాహం అభినందనీయ మన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయడంతోనే సత్ఫలితాలు వస్తున్నాయని అన్నారు. బాపట్ల జిల్లాలో పరిపాలన సజావుగా సాగడానికి అధికారులంతా బాధ్యతతో వ్యవహరిస్తున్నారని కలెక్టర్ తెలిపారు. ముఖ్యంగా స్పందనలో వస్తున్న అర్జీల పరిష్కారానికి అధికారులు ప్రాధాన్యత ఇవ్వడం సంతోషదాయకమన్నారు. సకాలంలో పరిష్కరించి ప్రజలలో సంతృప్తి స్థాయి పెంచారన్నారు. జగనన్నకు చెబుదాం పోర్టల్లో వచ్చే అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ప్రజలకు మంచి సేవలు అందిస్తున్నారని వివరించారు. అధికారులంతా ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని కలెక్టర్ సూచించారు.
బాపట్ల జిల్లాను తమ సొంత జిల్లాగా భావిస్తూ అధికారులు నిరంతరం చేస్తున్న కృషిని జిల్లా సంయుక్త కలెక్టరు డాక్టర్ కె శ్రీనివాసులు అభినందించారు. ఏడాది కాలంలో ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ సులభతరంగా పనిచేసేలా అవకాశాలు ఉండడం సంతోషదాయక మన్నారు. జిల్లా కలెక్టరు మార్గదర్శకాలు, సూచనలతో బాపట్ల జిల్లా మరింత వేగంగా పురోభివృద్ధి వైపు పయనిస్తోందని అన్నారు. అధికారుల సమన్వయ సహకారంతోనే రాష్ట్రంలో 5వ స్థానానికి బాపట్ల జిల్లా చేరిందని వివరించారు. అనంతరం జిల్లా అధికారులు తమ అనుభవాలను పంచుకున్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి కె లక్ష్మీశివజ్యోతి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.










