Nov 08,2023 21:00

సంపాదనలో కొంత మేర సేవా కార్యక్రమాలు
కరోనా సమయంలో పేదలకు నిత్యాసరాల పంపిణీ
క్రీడాకారులకు ప్రోత్సాహం, డాక్టరేట్‌ అందుకున్న నిరీక్షణరాజు
ప్రజాశక్తి - కాళ్ల
సేవే లక్ష్యంగా అతి తక్కువ కాలంలో ప్రజలకు చేరువయ్యేవారు చాలా అరుదు. అటువంటి వారిలో డి.నిరీక్షణరాజు ఒకరు. రాజకీయ నాయకులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు వీరంతా సమాజంలోని ప్రజలకు తమవంతుగా ఏదో ఒక విధంగా సేవలందిస్తుంటారు. అయితే వాళ్లు ఏదో ఒక రూపంలో తాము చేసిన సేవలకు ప్రతిఫలం పొందుతుంటారు. కొందరు మాత్రం సేవే లక్ష్యంగా తమ ఉదారతను చాటుకుంటూ ప్రజలకు దగ్గరవుతారు. ఆ కోవకు చెందిన వారు నిరీక్షణరాజు.
కాళ్ల మండలం కోపల్లె గ్రామానికి చెందిన డి.నిరీక్షణరాజు స్వతహాగా మృదు స్వభావి. 15 ఏళ్లుగా ఆక్వా రంగంలో లేబర్‌ కాంట్రాక్టర్‌గా, వివిధ వ్యాపారాల్లో రాణిస్తూ ఉన్నత స్థితికి ఎదిగారు. తన సంపాదనలో కొంతైనా సామాజిక సేవ, ఆధ్యాత్మికకు వెచ్చించాలనే దృక్పథంతో ఆక్వా కార్మికులకు, పేదలకు తన వంతుగా సాయమందిస్తున్నారు. ఆయన ప్రచారానికి దూరంగా, ప్రజలకు దగ్గరగా ఉంటారు. సమాజానికి మేలు చేసేవారు చెప్పుకోవాల్సిన పనిలేదని, తాను చేసే సేవ కనిపిస్తే చాలని అంటారు నిరీక్షణరాజు.
సమాజసేవే ఆయన లక్ష్యం..
సమాజ సేవే లక్ష్యంగా నిరీక్షణరాజు ముందుకు సాగుతున్నారు. ఐదేళ్లుగా ఆయన చేసిన సేవా కార్యక్రమాల వల్ల ఎంతో మంది పేద కుటుంబాలు లబ్ధిపొందాయి. పది మందికి సాయపడాలన్నదే నిరీక్షణరాజు అభిలాష.
ఆపదలో అండగా..
వ్యవసాయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన నిరీక్షణ రాజుకు సామాన్య ప్రజలు పడే కష్టాలు తెలుసు. ఈ క్రమంలోనే తన వంతు సాయంగా ప్రజలకు ఏదో విధంగా సాయపడాలన్న సదుద్దేశంతో పరులకు ఉపకారం చేస్తున్నారు. కరోనా కష్టకాలంలో ఆయన ఏమాత్రమూ భయపడలేదు. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ప్రజల మధ్యే తిరుగుతూ ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచారు. వందల మంది ఆకలితీర్చడమే కాకుండా ఆర్థిక సాయం అందించారు. కరోనా మొదటి, రెండు దశల్లో ఆక్వా పరిశ్రమల్లో పనిచేసే వందల మంది కార్మికులకు రెండు లక్షల రూపాయల విలువైన కూరగాయలు, నిత్యావసర సరుకులు అందజేశారు. అంతటి మనసున్న మరాజు నిరీక్షణరాజు.
అలాగే సామాజిక, విద్య, క్రీడ రంగాల్లో విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించడం, దేశ నాయకుల జయంతి, వర్థంతులు నిర్వహించి పేదలకు ఆర్థిక సాయం చేశారు. కరోనా సమయంలో వలస కార్మికులకు శానిటేషన్‌, మాస్కులు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. అంబేద్కర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కోపల్లెలో అంబేద్కర్‌ జయంతి, వర్థంతి వేడుకలు ఏటా నిర్వహిస్తున్నారు. నియోజకవర్గ స్థాయి వాలీబాల్‌ పోటీలు 2022లో ఘనంగా నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఏటా క్రిస్మస్‌ వేడుకలు నిర్వహిస్తున్నారు.
నిరీక్షణరాజుకు డాక్టరేట్‌ ప్రదానం
నిరీక్షణరాజు చేస్తున్న సేవలను గుర్తించి రాజస్థాన్‌లోని సన్‌రైజ్‌ యూనివర్సిటీ డాక్టరేట్‌ ప్రదానం చేసింది. కోపల్లె గ్రామంతో పాటు వివిధ గ్రామాల నుంచి అభిమానులు, స్నేహితులు వచ్చి అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా నిరీక్షణరాజును ఘనంగా సత్కరించారు.