ప్రజాశక్తి - కొత్తవలస : సేవచేయడంతోనే సమాజంలో మానవత్వం మెరుగుపడుతుందని జిల్లా ఎస్‌పి ఎం. దీపికా పాటిల్ అన్నారు. మండలంలోని మంగళపాలెంలో శుక్రవారం నిర్వహించిన గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ 25వ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం ప్రతీ వీధికో ఎన్‌జిఒలు పుట్టుకోస్తున్నాయని, అందులో కొన్ని ట్రస్టులు మాత్రమే నిస్వార్ధంగా సేవలు అందిస్తున్నాయన్నారు. 25 ఏళ్ల పాటు సుమారు 2 లక్షలకు పైగా కృత్రిమ అవయవాలను వికలాంగులకు ఉచితంగా అందజేసి, వారి స్వయం ఉపాధికి, వికలాంగుల అభ్యున్నతి కోసం జగదీశ్ ట్రస్ట్ ద్వారా అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ముందుగా గ్రామంలో ట్రస్ట్ సహకారంతో వికలాంగునికి అందజేసిన పాన్ షాప్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్బంగా షాప్‌లో ఎస్‌పి లాలీపాప్‌లను కొనుగోలు చేశారు. అనంతరం ట్రస్ట్ ప్రాంగణంలోని అవయవ తయారీ కేంద్రం, గురుదేవ ఆసుపత్రిని ఆమె సందర్శించారు. అనంతరం పలువురు వికలాంగులకు ఎస్‌పి చేతుల మీదుగా కృత్రిమ కాళ్ళు, చేతులు, చెవిటి మిషన్లు, బ్లైండ్ స్టిక్స్, వృద్ధులకు బియ్యం పంపిణీ చేశారు. వివిధ గ్రామాలకు చెందిన భజన సంఘాలకు సామాగ్రీ, దుస్తులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కొత్తవలస సిఐ చంద్రశేఖర్, ఎస్సై బొడ్డు దేవి, ట్రస్ట్ చైర్మన్ రాపర్తి జగదీశ్ కుమార్, వైస్ చైర్మన్ ఫణీంద్ర, గురుదేవ హాస్పటల్స్ సిఇఒ అచ్యుతరామ్మయ్య, డాక్టర్ రాఘవేంద్ర, డాక్టర్ సుజాత, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.










