Oct 26,2023 21:21

మూఢనమ్మకాలపై మానవహారం చేపడుతున్న ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు

ప్రజాశక్తి-గుమ్మలక్ష్మీపురం : విద్యార్థులు చదువుతో పాటు సామాజిక స్పృహ కలిగి ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జాతీయ సేవా పథకం కార్యక్రమాన్ని రూపొందించింది. ప్రతి విద్యార్థీ సామాజిక సేవలో భాగస్వాములుగా ఉంటూ క్షేత్రస్థాయిలో ప్రజలను చైతన్యవంతం చేస్తూ మంచి ఫలితాలను ఇస్తోంది ఈ కార్యక్రమం. ఇందులో భాగంగా గుమ్మలక్ష్మీపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఎన్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమాల ద్వారా గిరిజన గ్రామాల్లో ప్రజలను చైతన్య వంతులుగా తీర్చి దిద్దుతున్నారు. ప్రభుత్వ పథకాలు, పరిసరాల పరిశుభ్రత, వ్యాధులపై అవగాహన, పర్యావరణ పరిరక్షణ వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలను చైతన్య పరిచే దిశగా అడుగులు వేయిస్తున్నారు. రోగులకు, ప్రమాదంలో గాయపడిన వారికి, గర్భిణులకు అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం, విపత్తులు, వరదలు వచ్చినప్పుడు అందులో పాల్గొనేలా చైతన్యపరుస్తూ ప్రజలకు అండగా నిలిచేందుకు ఎన్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమం ఉపయోగపడుతోంది.
గిరిజన గ్రామాల్లో సేవలు
జాతీయ సేవా పథకంలో పాల్గొంటున్న విద్యార్థులు ఎస్‌కెపాడు, జెకెపాడు, ఎల్విన్‌పేట గ్రామాల్లో వివిధ సామాజిక కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువవుతున్నారు. వారం పాటు ప్రజలను చైతన్య పరిచే కార్యక్రమాలు నిర్వహిస్తూ సేవాస్ఫూర్తి చాటుకుంటున్నారు. స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో ఉన్న కాలువలు, రోడ్లపై చెత్తను, ముళ్ల పొదలను తొలగించి, గ్రామాలను పరిశుభ్రంగా తయారు చేస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్య అలవాట్లు, విద్య, వైద్యం వంటి కార్యక్రమాలపై ప్రజలకు వివరిస్తున్నారు. ప్రతిఒక్కరూ మొక్కలు నాటి రక్షించాలని, పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యత గురించి వివరిస్తున్నారు. ప్లాస్టిక్‌ వ్యర్థాలతో కలిగే ముప్పును వివరిస్తూ గ్రామాల్లో ఆరోగ్యకరమైన వాతావరణం కల్పిస్తున్నారు. వైద్య శిబిరాలను నిర్వహించి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారు. మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
ప్రజల్లో చైతన్యం
గిరిజన గ్రామాల్లో సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలను చైతన్య పరచడం సంతృప్తిగా ఉంది. ఎన్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమాల్లో భాగస్వాములైనప్పటి నుంచి నాలో సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరిగింది. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేయడానికి ముందుంటాను.
- పి.జీవన్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త

వైద్య శిబిరాల నిర్వహణ
ఎన్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించి ప్రజలకు సేవలు అందిస్తున్నాం. మరోవైపు మూఢ నమ్మకాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తున్నాం. ఇటువంటి సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉంది.
- ఎం.రేష్మ. ఎన్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త
నాయకత్వ లక్షణాలు
విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంచేందుకు ఎన్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమం దోహదపడుతుంది. ఈ కార్యక్రమం ద్వారా యువత మంచి మార్గంలో నడవడానికి వీలుంటుంది. ప్రతి ఏడాది క్యాంపులు నిర్వహిస్తున్నాం.
- బి.త్రినాథ్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ పిఒ,
డిగ్రీ కళాశాల, గుమ్మలక్ష్మీపురం
ఉత్తమ పౌరులుగా..
విద్యార్థుల్లో సోదరభావం, దేశభక్తి, క్రమశిక్షణ వంటివి ఏర్పడి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి ఎన్‌ఎస్‌ఎస్‌ శిబిరాలు ఎంతగానో ఉపయోగ పడతాయి. ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు భవిష్యత్తు తరాలకు మార్గదర్శకులుగా ఎదగాలనే లక్ష్యంతో ఈ శిబిరాలను నిర్వహిస్తున్నాం.
- టి.శ్రీవరం, ప్రిన్సిపల్‌,
డిగ్రీ కళాశాల, గుమ్మలక్ష్మీపురం