
ఒక ఊరిలో రాఘవయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి రాణి అనే కూతురు ఉంది. ఒకసారి రాఘవయ్య పనిమీద పొరుగున ఉన్న పట్టణానికి బయలుదేరాడు. దారిలో గాయాలతో బాధపడుతున్న కుక్క కనిపించింది. దాన్ని చూసి రాఘవయ్య జాలిపడ్డాడు. చుట్టుపక్కల వెదికి గాయాలను నయంచేసే ఆకులను కోసుకొచ్చాడు. ఆకులను నూరి రసాన్ని గాయాలకు పూశాడు. ఆకులను గాయాలపై ఉంచి తీగలతో కట్లు కట్టాడు. తాను వెంట తెచ్చుకున్న ఆహారాన్ని పెట్టి వెళ్లిపోయాడు. అలా అటుగా వెళ్లినప్పుడు ఆ కుక్క కనిపిస్తే నాలుగుసార్లు కట్లను మార్చి కట్టాడు. గాయాలు నయమయ్యాయి. కొన్ని రోజులకు రాఘవయ్య కూతురుకు వివాహం నిశ్చయమైంది. రాఘవయ్య పట్నం వెళ్లి, కూతురుకోసం నగలు కొని తెస్తున్నాడు. దారిలో ఒక దొంగ అడ్డుకున్నాడు. కత్తి చూపించి 'నీ దగ్గర ఏమున్నా తీసివ్వు' అంటూ బెదిరించాడు.
'అయ్యా! నేను ఎండలో, వానలో కష్టపడి సంపాదించుకున్న ధనంతో నా కూతురు కోసం నగలు కొని తెస్తున్నాను. ఈ నగలు లేకుంటే నా కూతురు పెళ్లి ఆగిపోతుంది. నన్ను వదిలేయండి' అన్నాడు బాధపడుతూ. ఆ మాటలు దొంగ చెవికెక్కలేదు. రాఘవయ్య జేబులో ఉన్న నగల మూటను లాక్కుని పరుగందుకున్నాడు. అప్పుడే అటుగా వచ్చిన కుక్క ఇదంతా చూసింది. వెంటనే దొంగ వెంట పడింది. దొంగరాళ్లు విసురుతున్నా ఆగలేదు. దొంగ భయపడిపోయి ధనం మూటను వదిలేసిపోయాడు. ఆ మూటను తెచ్చి రాఘవయ్యకిచ్చింది. దయాగుణంతో తన గాయాలను నయం చేసిన రాఘవయ్యకు ఈవిధంగా సహాయపడినందుకు సంతోషించింది. 'తన నగలు తనవద్దకు చేరడం సేవా ఫలమే' అనుకున్నాడు రాఘవయ్య.
- పాత్లావత్ వినోద్,
9వ తరగతి,
నేరళ్ళపల్లి జెడ్‌పిహెచ్ స్కూలు,
మహబూబ్ నగర్ జిల్లా.