
మానవత భీమడోలు అధ్యక్షులు సుగుణాకర్
ప్రజాశక్తి - భీమడోలు
తన తండ్రి, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల న్యాయ కార్యదర్శిగా పనిచేసిన వట్టి వీర వెంకట సత్యనారాయణ శత జయంతి పురస్కరించుకొని నిర్వహించిన సేవా, సంక్షేమ కార్యక్రమాలకు ఆదరణ లభించటం ఆనందదాయకంగా ఉందని మానవత భీమడోలు శాఖ అధ్యక్షులు వట్టి సుగుణాకర్ తెలిపారు. గత రెండు రోజులుగా మానవత శాఖ ద్వారా వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. శనివారం నిర్వహించిన కార్యక్రమాల్లో భాగంగా ఆయన విద్యా వ్యాప్తికి సహకరించే క్రమంలో పూళ్ళ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రూ.35 వేల విలువ గల కంప్యూటర్‌ను అందజేశారు. విద్యా కుసుమాలను అభినందించే కార్యక్రమంలో భాగంగా భువనేశ్వర్‌లో ఐఐటీ చదివి జీవితంలో స్థిరపడిన ఎంఎం పురం గ్రామానికి చెందిన అమజాల అభిరామ్ భవిష్యత్తులో మరికొందరికి సహాయ పడాలన్న ఉద్ధేశంతో ప్రోత్సాహక రూపంలో తమ వంతు సహకారంగా రూ.25 వేల నగదు పురస్కారాన్ని ప్రకటించారు. ఈ నేపథ్యంలో యంయం పురంలోని ఆయన నివాసంలో అభిరామ్ తల్లిదండ్రులను సత్కరించి, సదరు మొత్తాన్ని అందజేశారు. ఇదే క్రమంలో ఉన్నత స్థాయి విద్యాభ్యాసం కొనసాగించే క్రమంలో బిఎస్‌సి నర్సింగ్ చదువుతున్న భీమడోలుకు చెందిన బుంగా చంద్రశేఖర్, బి ఫార్మసీ చదువుతున్న యార్లగడ్డ స్పందన ఒక్కొక్కరికి రూ.15 వేల వంతున ఆర్థిక సహాయాన్ని పూళ్ళ హైస్కూల్ వద్ద అందజేశారు. సేవా కార్యక్రమంలో భాగంగా క్యాన్సర్ వ్యాధితో ఇబ్బంది పడుతున్న రోగికి చికిత్స కోసం రూ.5 వేలు అందజేశారు. తన తండ్రి సంస్మరణార్థం 80 మంది వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మానవత జిల్లా అధ్యక్షులు టి.మోహనరావు, జిల్లా నాయకులు ఆలపాటి నాగేశ్వరరావు, ఎం.కోటేశ్వరరావు, రమణ, శంకర్‌తో పాటు సామాజిక కార్యకర్త మండే సుధాకర్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.