విద్య, వైద్యం, క్రీడలు, ఆథ్యాత్మిక రంగాల్లో చేయూత
త్వరలో ట్రస్ట్ ఏర్పాటుతో సేవలు మరింత విస్తృతం
ప్రజాశక్తి-మాడుగుల : వ్యాపారవేత్తగా ఆర్జించిన లాభాలతో విద్య, వైద్యం, క్రీడలు, ఆథ్యాత్మిక రంగాల్లో సేవా కార్యక్రమాలను విరివిగా నిర్వహిస్తూ పలువురి మన్ననలు పొందుతున్నారు అనకాపల్లికి చెందిన ముత్యాల వేంకటేశ్వరరావు (ఎంవిఅర్). ప్రముఖ వ్యాపారవేత్తగా ఈ ప్రాంత ప్రజలకు సుపరిచితులు. జిల్లావ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ శబాష్ అనిపించుకుంటున్నారు.
ప్రతిభ కలిగి ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల ఉన్నత విద్యకు , ఉన్న చదువు కొనసాగేందుకు జిల్లావ్యాప్తంగా పలువురు విద్యార్థులకు ఎంవిఆర్ ఆర్థికసాయం చేస్తున్నారు. వైద్య సదుపాయాలు తక్కువగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ, వారికి నాణ్యమైన వైద్యసేవలతోపాటు ఉచిత మందుల పంపిణీ చేస్తున్నారు. మాడుగుల నియోజకవర్గం చీడికాడ మండలం శిరిజాంలో ఇటీవల వైద్య శిబిరం నిర్వహించి, ఒక అంబులెన్స్ సదుపాయం కూడా సమకూర్చారు. మాడుగుల మండలం ఒమ్మలిలో మోదకొండమ్మ దేవాలయం అభివృద్ధికి విరాళం అందించారు. అనకాపల్లి గ్రామీణ జిల్లాలో క్రీడాభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నారు. ముఖ్యంగా జీర్ణావస్థలో వున్న దేవాలయాల అభివృద్ధికి విరాళాలు అందిస్తూ, ఆధ్యాత్మిక సేవలను విశేషంగా చేస్తున్నారు. అరవై ఏళ్లు దాటిన వారికి సింహాచలం, అన్నవరం, కనక మహాలక్ష్మి దేవాలయాల సందర్శనకు ఉచితంగా వాహనాలు ఏర్పాటు చేస,ి దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. నిరుద్యోగ యువతను ఆదుకునేందుకు తమ సంస్థ ఎంవిఅర్ సాప్ట్‌వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా పలువురికి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారు.
ట్రస్ట్ ఏర్పాటుతో సేవా కార్యక్రమాలు విస్తృతం
ప్రస్తుతం నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు అదనంగా, త్వరలో ఎంవిఅర్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహణకు సమాయత్తమవుతున్నారు. సాయం కోసం వచ్చిన వారికి లేదనకుండా, చేతనైనా తోడ్పాటునందిస్తూ, అందరి తలలో నాలుకలా పేరు ప్రఖ్యాతులు సాధిస్తున్నారు .ముత్యాల వేంకటేశ్వరరావు త్వరలో రాజకీయ రంగప్రవేశం చేయనున్నారనే వార్తల నేపధ్యంలో, దీనిపై ఆయన స్పందిస్తూ, ప్రస్తుతానికి అటువంటి ఆలోచన లేదని, అన్ని పార్టీలతో సత్సంబంధాలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం తన దృష్టంతా సేవా కార్యక్రమాలపైనే ఉందని స్పష్టం చేశారు.










