
సరళీకరణ ఆర్థిక విధానాలు అమలులోకి వచ్చాక సమాజాన్ని తిరోగమన దిశకు మళ్లించాలనే ధోరణులు లేదా యథాస్థితిని కొనసాగించాలనే ఆలోచనలు పైచేయి సాధించడానికి పెద్ద ప్రయత్నాలే ప్రారంభమయ్యాయి. ఈ ప్రయత్నాలను వమ్ము చేయాలంటే... నేడు భావజాల రంగంలో చోటు చేసుకున్న పరిణామాలను...అభ్యుదయ భావజాలం వైపు నిలబడే శక్తులు క్షుణ్ణంగా
అధ్యయనం చేయాలి. అందుకు విజ్ఞానకేంద్రం వేదిక కావాలి.
ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రజా జీవితాన్ని సానుకూలంగా మార్చడంలో విజ్ఞాన కేంద్రాలు ముఖ్యమైన పాత్ర నిర్వహించాలి. అభ్యుదయ, హేతువాద, ప్రగతిశీల, లౌకిక, ప్రజాస్వామ్య, వామపక్ష, దేశభక్తి భావాలు కలిగిన శక్తులకు అనుసంధాన కేంద్రంగా, సమన్వయ సహకార కేంద్రంగా ఇవి పనిజేయాల్సిన అవసరం ఎంతైనా వుంది.
ఈ నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం ప్రారంభోత్సవం మే 19న విశాఖలో జరుగుతోంది. అల్లూరి సీతారామరాజు తన జీవితాన్ని గిరిజన హక్కుల కోసం అంకితం చేశాడు. బ్రిటీష్ పాలకులు అన్ని వనరులతోపాటు అటవీ సంపదను కొల్లగొట్టడాన్ని ప్రతిఘటించి 'అడవుల్లో నివసించే గిరిజనులకు అటవీ సంపద మీద హక్కు' అనే కోర్కెను ముందుకు తెచ్చాడు. వెనుకబడ్డ గిరిజనుల మనుగడకు, అభివృద్ధికి రాజ్యాంగంలో రక్షణలు పొందడానికి ఈ గిరిజన ఉద్యమాలు ఎంతగానో తోడ్పడ్డాయి. అల్లూరి సీతారామరాజు మన్యం పోరాటంతో దేశభక్తిని రగిల్చి జాతీయోద్యమానికి స్ఫూర్తిని నింపాడు. ఆ మహనీయుని పేరిట నూతన భవనాన్ని (అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం) నిర్మించి ఆయన ఆశయాలకు అంకితం కావడం విశాఖ నగర పౌర జీవనంలో ఆహ్వానించదగ్గ పరిణామం.
అల్లూరి సీతారామరాజు ట్రస్టు 2016లో రిజిస్టర్ అయ్యింది. గజ్జి, తామర లాంటి వ్యాధులు ట్రైబల్ హాస్టళ్ళలో అనాదిగా తీవ్రమైన సమస్యగా వేధిస్తూ వచ్చాయి. స్కెబీస్ వ్యాధికి దాతల సహాయంతో ఎస్సేబియాల్ మందులు కొని, 40 వేల మంది బాల బాలికలకు నయమయ్యే దాకా (మందులు రాసి, స్నానం చేయించి, బట్టలు ఉతికించి) ట్రస్టు అమోఘమైన సేవలందించింది. గిరిజన బిడ్డలకు మంచి విద్య అందించడానికి శారదా ట్రస్టు కృషికి ఈ ట్రస్టు తోడయ్యింది. సెరిబ్రల్ మలేరియా ప్రాణాంతకంగా ఉన్నా, కరోనా వచ్చినా అల్లూరి సీతారామరాజు ట్రస్టు అందించిన సేవలతో వారి ప్రేమాభిమానాలు పొందింది.
విజ్ఞానకేంద్రం నేపథ్యం
ప్రజల జీవితంలో సామాజిక, ఆర్థిక మార్పు సాధించాలంటే ఒక్క రాజకీయ ఆర్థిక రంగాలలో జరిగే కృషి సరిపోదు. ఇది బహుముఖంగా అన్ని జీవన రంగాల్లో జరగాలి. మేధోపరమైన కృషి సాగితేనే సాంస్కృతిక రంగం తన వంతు పాత్ర వహించడం సాధ్యమవుతుంది. సమాజాన్ని తిరోగమన దిశకు మళ్ళించడానికి సాంస్కృతిక రంగాన్ని పెద్దయెత్తున వినియోగించుకుంటున్న సందర్భమిది. దేశ స్వాతంత్రోద్యమ రోజుల్లో మతం, కులం, భాష, ప్రాంతంతో నిమిత్తం లేకుండా ప్రజలందరూ ఐక్యం అయ్యారు. వివిధ మతాలవారు, భాషల వారు సంపూర్ణ స్వాతంత్య్రం అన్న ఆశయం వైపు ఐక్యం అయ్యారు. ఆనాడు సాంస్కృతిక జీవనంలో సంస్కరణోద్యమాలు ప్రజల్ని ఎంతగానో ప్రభావితం చేశాయి. బాల్య వివాహాలు కూడదని, వితంతు వివాహాలు ప్రోత్సహించాలని ఉద్యమాలు సాగాయి. మహిళలకు పురుషులతో సమాన హక్కులు డిమాండు లేవనెత్తబడింది. ఉన్నవ లక్ష్మీనారాయణ 'మాలపల్లి' నవలలో అంటరానితనం, కూలి పోరాటాల ప్రాధాన్యత గురించి చెప్పారు. భౌతికవాద దృక్పథాన్ని చొప్పించి నాటి శాస్త్రీయ ఉద్యమాలకు ఊపిరి పోశారు. జాతీయోద్యమ రోజుల్లో సంస్కరణోద్యమాలు ఆర్థిక, రాజకీయ పోరాటాలకు బాసటగా నిలబడ్డాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ఈ సాంప్రదాయం కొనసాగుతూ వచ్చింది. కానీ సరళీకరణ ఆర్థిక విధానాలు 1990-91లో అమలు లోకి వచ్చాక సమాజాన్ని తిరోగమన దిశకు మళ్లించాలనే ధోరణులు లేదా యథాస్థితిని కొనసాగించాలనే ఆలోచనలు పైచేయి సాధించడానికి పెద్ద ప్రయత్నాలే ప్రారంభమయ్యాయి. ఈ ప్రయత్నాలను వమ్ము చేయాలంటే...నేడు భావజాల రంగంలో చోటు చేసుకున్న పరిణామాలను...అభ్యుదయ భావజాలం వైపు నిలబడే శక్తులు క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. అందుకు విజ్ఞానకేంద్రం వేదిక కావాలి.
సరళీకరణ విధానాలే తిరోగమన భావజాలానికి కారణం
ఇది ఆధునిక వైజ్ఞానిక యుగం. ఈ కాలంలోనే సమాజంలో మతతత్వం విజృంభిస్తోంది. లౌకిక రాజ్యంలో మతానికి, రాజకీయానికి ముడి పెడుతున్నారు. అవసరాన్ని బట్టి కులాన్ని కూడా రెచ్చగొట్టి వినియోగిస్తున్నారు. అశాస్త్రీయ భావాలను, మూఢనమ్మకాలను భావజాల రంగంలో ముందుకు తెస్తున్నారు. మాధ్యమాల్లో అవి విపరీతమైన ప్రచారాన్ని పొందుతున్నాయి. యూనివర్సిటీల్లో మేధావులతోపాటు శాస్త్రజ్ఞులు కూడా వీటిని ప్రోత్సహిస్తున్నారు. విద్యార్థినీ, విద్యార్థులకు శాస్త్రీయ దృక్పథం బోధించవలసిన చోట అశాస్త్రీయ ఆలోచనలు ప్రచారంలో ఉన్నాయి. పాఠ్య పుస్తకాల్లో సిలబస్‌ను సైతం వక్రీకరిస్తున్నారు.
సరళీకరణ ఆర్థిక విధానాల అమలు అనంతరం దేశంలో సాంస్కృతిక రంగంలో తిరోగమన భావజాలం ఊపందుకుంది. సమాజ మార్పుకు దోహదపడే సైద్ధాంతిక అంశాలను ఇది వక్రీకరిస్తున్నది. ఛాందసవాద, అశాస్త్రీయ భావజాలాన్ని సరళీకరణ విధానాలతో మేళవించి బతికించడానికి సంస్కృతిని సాధనంగా ఎంచుకున్నది. లౌకిక ప్రజాస్వామ్యంగా రూపొందిన రాజ్యాంగ చట్రాన్ని ధ్వంసం చేయడానికి పూనుకుంటోంది. మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి సాంస్కృతిక రంగం సాధనం అయ్యింది.
మహిళలపైన, దళితులపైన అత్యాచారాలు, దౌర్జన్యాలు ఇటీవల ఎక్కువవుతున్నాయి. మత్తు పదార్ధాల వ్యాపారమూ ఎక్కువయ్యింది. సామాజిక మార్పు కేవలం ఆర్థిక, రాజకీయ కార్యకలాపాలతోనే సాధ్యం కాదు. ఆర్థిక రంగంలో ప్రస్తుత పరిణామాల మూలంగా పరోపకార స్పృహ, మానవత్వ విలువలు తగ్గిపోతున్నాయి. వినిమయ సంస్కృతి, వ్యక్తివాదం, స్వార్థ దృక్పథం పైచేయి సాధిస్తున్నాయి. వీటన్నింటిని అరికడితేనే దేశ పురోగతి సాధ్యమవుతుంది.
స్వేచ్ఛా మార్కెట్ పర్యవసానాలు
సరళీకరణ ఆర్థిక విధానాలతో మార్కెట్ విధానం అమల్లోకి వచ్చింది. ఇది సామాజిక రంగంలో ఎన్నో మార్పులకు కారణమవుతోంది. స్వేచ్ఛా మార్కెట్ విధానాలు ప్రజల మధ్య పెద్దయెత్తున విభజనలు సృష్టిస్తున్నాయి. అవకాశాలను పరిమితం చేశాయి. పరిమితమైన అవకాశాలు పోటీని తీవ్రతరం చేశాయి. భవిష్యత్తుపై అభద్రతాభావం పెంచాయి. ఒంటరితనం, నిస్సహాయ స్థితి లాంటి వాటిని పెంచాయి. సమాజంలో ప్రజల మధ్య వైవిధ్యాన్ని పెంచి గతంలో ఉన్న ఐక్యత లేకుండా చేశాయి. సరళీకరణ విధానాల ఆధిపత్యంలో చిక్కుకున్న ఇంటర్‌నెట్, మీడియా నెట్‌వర్క్, ఎంటర్‌టైన్‌మెంట్ రంగం వంటివన్నీ ఒంటరితనం, నిస్సహాయత, వినియోగదారీతత్వాన్ని ప్రోత్సహిస్తున్నాయి. సమిష్టితత్వం స్థానంలో వ్యక్తిత్వవాదమూ ప్రబలింది. అభివృద్ధి నిరోధక భావజాలాన్ని ఆయుధంగా చేసుకుని వ్యక్తిని సామాజిక స్పృహ నుండి వేరు చేసే ప్రయత్నం ఎక్కువైంది. మారిన ప్రపంచంలో ప్రవేశించిన సరళీకరణ ఆర్థిక విధానాలు భావజాల రంగాన్ని భారీగా ప్రభావితం చేస్తున్నాయి. అభివృద్ధి నిరోధక భావజాలాన్ని ఎదుర్కోవడానికిగాను...శాస్త్రీయ ఆలోచనల ఆధారంగా ప్రజల అన్ని జీవన రంగాల్లో కృషి చేస్తూ చైతన్యం కలిగించాలి. అందుకవసరమైన సంఘ సంస్కరణోద్యమాలకు, సేవా కార్యక్రమాలకు బాసటగా అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం నిలవాలి.
/ వ్యాసకర్త : ఎ.పి సిపిఎం పూర్వ కార్యదర్శి /
పెనుమల్లి మధు