ప్రజాశక్తి - కలెక్టరేట్ : మణిపూరులో శాంతిని నెలకొల్పాలని, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను ఆపేందుకు ప్రధానమంత్రి మోడీ పూనుకోవాలని, హింసను అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని, రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్న అరాచక శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి మెయిన్ రోడ్డు మీదుగా పాత బస్టాండ్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం నాలుగురోడ్ల జంక్షన్ వద్ద విద్యార్థులనుద్దేశించి ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష్య కార్యదర్శులు డి.పండు, పి.రాజశేఖర్ మాట్లాడుతూ 75 జాతీయ వసంతాల సందర్బంగా గత ఏడాది అమృత్సోవాలకు పిలుపునిచ్చిన మోడీ, 76 వ జాతీయ వసంతాల సందర్బంగా సేవ్ మణిపూర్ కార్యక్రమా లకు పిలుపునివ్వాలని డిమాండ్ చేశారు. మూడు నెలలుగా మణిపూర్లో మైతీ, కుకి తెగల మధ్య మొదలైన హింసకాం డవల్ల 200 మంది హత్య చేయబడ్డారని, ప్రతి రోజు మహిళలపైన, విద్యార్థులపైన అత్యాచారాలు జరుగుతున్నా యని, అనేకమంది కుకి తెగకు సంబంధించిన గిరిజనుల ఇళ్లను తగలబెట్టారని, ఇంత విధ్వంసం జరుగుతున్నా ప్రధాని మోడీ కానీసంగా స్పందించకపోవడం చూస్తే మణిపూర్లో జరుగుతున్న హింసకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అండదండ లతో జరుగుతుందని వాపోయారు. తక్షణం మాణిపూర్లో శాంతిని నెలకొల్పాలని డిమాండ్ చేశారు. మహిళలను వివస్త్ర చేసి రోడ్లమీద బహిరంగంగా నడిపించి, అత్యాచారం అనంతరం హత్యచేసిన ఘటన దేశం తలదించుకునేలా ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిగ్గుపడాలని, ఇలా బయటకు రాకుండా జరిగిన అనేక అఘాయిత్యాలకు మోడీ, మణిపూర్లో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. గిరిజనుల భూములను మైతే ప్రజలకు ఇవ్వాలనే సాకుతో విలువైన ఖనిజాలు కలిగిన కొండ ప్రాంతాలను కార్పొరేట్ సంస్థలకు అప్పగించాలనే కుట్ర దాగిఉందని, కాబట్టే కేంద్రం ప్రభుత్వం హింసాకాండను అరికట్టేందుకు ఏ ప్రయత్నమూ చేయలేదని, మానవత్వంలేని ప్రధానిగా మోడీ చరిత్రలో మిగిలిపోతారని విమర్శించారు. తక్షణం అల్లర్లకు పాల్పడే అరాచకశక్తులపై కఠినచర్యలు తీసుకుని మాణిపూర్లో శాంతిని నెలకొల్పాలని డిమాండ్ చేశారు. మేధావులు, ప్రజాస్వామికవాదులు, దేశ సమైక్యతను కోరుకునేవారు తక్షణం మోడీ ప్రభుత్వ మతోన్మాద చర్యలను ఖండించాలని, లేకపోతే మాణిపూర్ ప్రయోగం దేశవ్యాప్తంగా బీజేపీ, ఆరెస్సెస్ అమలుచేస్తుందని హెచ్చరించారు. నిరసన ర్యాలీలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు సిహెచ్.సింహాచలం, కె.రాజు, ఎ.గంగారావు, చిన్నారి, కె.భాస్కర్, పి.వరుణ్, కె.ఉదరు, హరి, ఎం.అన్నాజీ, ఉమా శంకర్, దిలీప్, పట్టణంలోని వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.










