సుందర లక్షద్వీప్‌లో చిచ్చు పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. అభివృద్ధి పేరిట చేస్తున్న ఏకపక్ష విన్యాసాల పట్ల లక్షద్వీప్ ప్రజానీకం తీవ్ర స్థాయిలో ఆగ్రహంతో స్పందిస్తోంది. లక్షద్వీప్‌లో ప్రస్తుతం నెలకొన్న ఈ పరిస్థితికి కేంద్ర ప్రభుత్వం, దాని కనుసన్నల్లో నడిచే పాలనాధికారిదే బాధ్యత! పర్యావరణానికి అనుకూలంగా, స్థానిక ప్రజల జీవన స్థితిగతులను మెరుగుపరిచేదే కదా అభివృద్ధి అంటే...! కానీ, పాలనాధికారి ప్రఫుల్ కె.పటేల్ రూపొందించిన ప్రతిపాదనలు అలాంటివి కావు. పర్యావరణ వైవిధ్యానికి, ప్రకృతి సౌందర్యానికి అద్దం పట్టే 36 దీవుల సముదాయపు లక్షద్వీప్‌లో ప్రజల నివాసానికి అనుకూలమైనవి పది దీవులే! దీనిని బట్టే అక్కడి పర్యావరణ, జీవావరణ ప్రత్యేకతలేమిటో అర్ధం చేసుకోవచ్చు. తాజాగా రూపొందించిన లక్షద్వీప్ డెవలప్‌మెంట్ అథారిటీ రెగ్యులేషన్ -2021 ప్రకారం ఈ దీవులన్నింటిలో పర్యాటక కార్యక్రమాల పేరిట హోటళ్ళు, భవనాలు పెద్దఎత్తున నిర్మిస్తారు. మైనింగ్ కార్యక్రమాలకూ అనుమతిచ్చారు. వీటి కోసం ప్రజల ఆస్తులను నష్టపరిహారం చెల్లించకుండా స్వాధీనం చేసుకునే హక్కు పాలనాధికారికి దఖలు పడుతుందని పేర్కొన్నారు. కళ్ళ ముందే, జన్మభూమికి మరణశాసనం రాస్తుంటే ఎవ్వరూ చూస్తూ ఊరుకోరు కదా...! అలా ఎవరైనా ప్రతిఘటిస్తే అణచివేయడానికి వీలుగా యాంటీ సోషల్ యాక్టివిటీస్ బిల్లు పేరుతో గూండా చట్టాన్ని ప్రతిపాదించారు. దీని ప్రకారం ఎవరిపైనైనా అనుమానం వస్తే ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి సంవత్సరం పాటు జైలులో పెట్టవచ్చు. దేశంలోనే అతి తక్కువ క్రైం రేటు ఉన్న ప్రాంతాల్లో లక్షద్వీప్ కూడా ఒకటి. అటువంటి చోట ఇటువంటి చట్టం ఎందుకు? ఎందుకో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదుకదా!
ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి సముద్రంలో చేపలు పట్టడం. సిఆర్‌జడ్ నిబంధనల పేరిట సముద్రపు ఒడ్డున ఉంచిన బోట్లను, వలలను ధ్వంసం చేయించారు. ఇక్కడి ప్రజల రాకపోకలు, వాణిజ్య వ్యవహారాలు తరతరాలుగా కేరళతో ముడిపడి ఉన్నాయి. కేరళ కోజికోడ్ జిల్లా నుండి లక్షద్వీప్‌కు జరిగే వాణిజ్య కార్యకలాపాలను ఆయన నిషేధించారు. లక్షద్వీప్‌లో ఆవుల సంఖ్య చాలా తక్కువ! అవి కూడా ప్రభుత్వ డెయిరీల వద్ద తప్ప ప్రజల దగ్గర లేవు. అదే విధంగా దేశవ్యాప్తంగా జనాభా పెరుగుదల రేటు 2.2గా ఉంటే, లక్షద్వీప్‌లో 1.4 మాత్రమే! అయినా బీఫ్ నిషేధం, ఇద్దరు పిల్లల కంటే ఎక్కువమంది సంతానం ఉంటే ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలులేదన్న ప్రతిపాదనలను ముందుకు తీసుకురావడం స్థానికంగా అధిక సంఖ్యలో ఉన్న ముస్లిం జనాభాను లక్ష్యం చేసుకోవడమే కదా!
ఇప్పటిదాకా ఉన్నతాధికారులనే పాలనాధికారులుగా నియమించే సాంప్రదాయం ఉంది. అయితే, ప్రధాని నరేంద్రమోడీ తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన పటేల్‌ను లక్షద్వీప్‌కు పాలనాధికారిగా పంపారు. ఒక రాజకీయనేతకు ఇటువంటి కీలకబాధ్యతలు అప్పగించడమే వివాదాస్పదం. బాధ్యతలు స్వీకరించగానే కఠినంగా అమలవుతున్న కరోనా నిబంధనలను ఎత్తివేయడం ద్వారా అప్పటిదాకా ఒక్క కరోనా కేసు కూడా లేని లక్షద్వీప్‌లో పది శాతం మందికి వైరస్ సోకడానికి పటేల్ కారణమయ్యారు. స్థానికంగా ఉన్న ప్రభుత్వ డెయిరీలను మూసివేసి గుజరాత్‌కు చెందిన అమూల్‌కు మాత్రమే పాల విక్రయానికి అనుమతిచ్చారు. దీంతో తమ ప్రాంతాన్ని గుజరాత్‌కు వలసగా మారుస్తున్నారన్న అభిప్రాయం స్థానిక ప్రజల్లో ఏర్పడింది. అక్కడితో ఆగకుండా ఆచార వ్యవహారాలు, భాష, సంస్కృతి, జీవనోపాధి చివరకు తినే ఆహారం విషయంలో కూడా పాలనాధికారి జోక్యం చేసుకుంటుండటంతో స్థానిక ప్రజలకు తిరగబడటం తప్ప మరోమార్గం లేకుండా పోయింది. ప్రధాన భూభాగం (మెయిన్ ల్యాండ్) తమకు రక్షణగా, కష్టకాలంలో అండగా ఉంటుందన్న నమ్మకాన్ని ఈ తరహా దీవుల్లో ఉంటున్న ప్రజానీకానికి కలిగించాలి. దానికి భిన్నంగా వారిపై పెత్తనం చేసి, జీవితాలను ధ్వంసం చేసేలా ప్రవర్తించడం తప్పే కాదు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. దేశ ప్రజలందరు లక్షద్వీప్ ప్రజలకు బాసటగా నిలవాల్సిన సమయమిది. అందుకే కేరళ అసెంబ్లీ లక్షద్వీప్‌ను రక్షించండంటూ తీర్మానం చేయాల్సి వచ్చింది. తమిళనాడు ముఖ్యమంత్రి కూడా లక్షద్వీప్ ప్రజలకు మద్దతు ప్రకటించారు. మరి, మోడీ సర్కారు వైఖరిలో మార్పు వస్తుందా..!










