Mar 01,2023 21:44

ఎగువలో శేష వాహనంపై దర్శనమిచ్చిన జ్వాల నరసింహ స్వామి

శేష వాహనంపై అహోబిలేసుడు
దిగువలో గరుడ విమానంలో ప్రహ్లాద వరదుడు,శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు
ప్రజాశక్తి - ఆళ్లగడ్డ

      అహౌబిలం బ్రహ్మౌత్సవాల్లో భాగంగా ఎగువలో 5వ రోజు బుధవారం శేష వాహనంపై జ్వాలా నరసింహ స్వామి, శ్రీదేవి భూదేవి అమ్మవార్లు భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేసిన అనంతరం శేష వాహనంపై మాడ వీధుల గుండా గ్రామోత్సవం నిర్వహించారు. మధ్యాహ్నం జ్వాల నరసింహ స్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు అర్చకులు లక్ష్మీనరసింహాచార్యులు వేదమంత్రాల నడుమ అభిషేకం నిర్వహించారు. రాత్రి జ్వాల నరసింహస్వామి విశేష అలంకరణలో చంద్రప్రభ వాహనంపై కొలువుతీరి భక్తులకు దర్శనమిచ్చారు.
దిగువ అహౌబిలంలో : దిగువ అహౌబిలంలోఉదయం ప్రహ్లాద వరద స్వామి, శ్రీదేవి భూదేవి అమ్మవార్లు శ్రీ యోగ నృసింహ గరుడ విమానంపై కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. అహౌబిల మఠం పీఠాధిపతి శ్రీ రంగనాథ యతీంద్ర మహదేశికన్‌ సమక్షంలో ప్రధాన అర్చకులు వేణుగోపాలచార్యులు, అర్చక బృందం ఉత్సవమూర్తికి పూజలు నిర్వహించారు. అనంతరం అహౌబిలం మాడవీధుల గుండా గ్రామోత్సవం నిర్వహించారు. గ్రామోత్సవంలో అహౌబిలం మఠం చేరుకున్న శ్రీ ప్రహ్లాద వరద స్వామి, అమ్మవార్లకు పీఠాధిపతి స్వామి ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం ఉత్సవమూర్తులకు అభిషేకం నిర్వహించారు. రాత్రి ఉత్సవమూర్తిని అలంకరించి హనుమంత వాహనంపై కొలువుంచి ప్రత్యేక పూజలు చేసి అనంతరం అహౌబిలం మాడ వీధుల గుండా గ్రామోత్సవం నిర్వహించారు. గరుడాద్రి పర్వతాన కొలువుతీరిన అహౌబిలేసుడు రాముని రూపంలో కారంజ నరసింహస్వామిగా ఆంజనేయ స్వామికి దర్శనమిచ్చారు.. దీనికి సూచికగా హనుమంతుడి పై జ్వాల నరసింహ స్వామి విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారని అర్చకులు తెలిపారు.