ప్రజాశక్తి-వన్‌టౌన్: సేంద్రియ వ్యవసాయంతో ప్రకతి సిద్దమైన పర్యావరణాన్ని కాపాడవచ్చునని కెఎల్ డీమ్డ్ యూనివర్శిటీ కార్యదర్శి కోనేరు శివకాంచన లత అన్నారు. స్థానిక కెబిఎన్ కళాశాలలో ఏర్పాటు చేసిన సేంద్రియ వ్యవసాయం క్షేత్రాన్ని ఆమె గురువారం లాంచనంగా ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సేంద్రీయ వ్యవసాయ, మిద్దె తోటల అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఆమె సేంద్రియ వవ్యసాయం గురించి వివరించారు. జీవాధారిత వ్యవసాయంగా సేంద్రియ వ్యవసాయాన్ని వర్ణించవచ్చునని అన్నారు. సేంద్రియ వ్యవసాయం జీవుల వైవిధ్యాన్ని, సూక్ష్మ జీవుల వివిధ దశలను, పనితనాన్ని వద్ది పరుస్తుందన్నిరు. ముఖ్యంగా ప్రాంతీయంగా లభించే వనరులతో వ్యవసాయం చేయడానికి అధిక ప్రాధాన్యతను ఇస్తూ , హానికర రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించే విదంగా సేద్యాన్ని చేయాలన్నారు. సేంద్రీయ వ్యవసాయం పెట్టుబడి లేని వ్యవసాయమన్నారు. సేంద్రీయ వ్యవసాయం పట్ల ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాలన్నారు. భారతదేశంలో క్రీస్తు పూర్వం నుండి బ్రిటీషు పాలన వరకూ సేంద్రియ వ్యవసాయన్నే రైతులు నమ్ముకున్నారని గుర్తు చేశారు. దీంతో మూడు నాలుగు దశాబ్దాలపాటూ ప్రకతి వ్యవసాయం మరుగున పడి రసాయన వ్యవసాయం వెలుగులోకి వచ్చిందన్నారు. ఇప్పటికైనా రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లడం శుభపరిణామమని అన్నారు. కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ తూనుగుంట్ల శ్రీనివాస్ కళాశాలలోని అర ఎకరా స్థలాన్ని సేంద్రియ వ్యవసాయం చేయడానికి కేటాయించారని ఈ సందర్బంగా వారిని అభినందించారు. కెబిఎన్ కళాశాల ప్రిన్సిపల్ నారాయణరావు మాట్లాడుతూ గహిణులు మిద్దె తోటల పట్ల అవగాహన పెంచుకోవడం వలన కుటుంబ ఖర్చులు తగ్గడంతో పాటు కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందన్నారు. గహిణులు ఖాళీ సమయాల్లో రోజుకు ఒక గంట లేదా రెండు గంటలు సమయాన్ని కేటాయించుకుని ఇంటిపైన ఉన్న టెర్రాస్ పైన ప్లాస్టిక్ బక్కెట్లు, కవర్లు ఉపయోగించి ఇప్పటికే పలువరు గహిణులు మిద్దె తోటలను విజయవంతంగా సాగు చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. వన్ ఎర్త్ వన్ లైఫ్ స్వచ్చంద సంస్థ నిర్వాహకులు ఈ. లీలాకుమారి, శ్యాంప్రసాద్ , సురేష్, విజరు, రవి లు సేంద్రియ వ్యవసాయం, మిద్దె తోటల నిర్వహణ గురించి విద్యార్దులకు అవగాహన కల్పించారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్‌లు పిఎల్.రమేష్, డాక్టర్ ఎం.వెంకటేశ్వరరావు, బోటనీ విభాగాధిపతి అలీబాష తదితరులు పాల్గొని అవగాహనా సదస్సును నిర్వహించడానికి అవకాశాన్ని, వసతులను కల్పించినందుకు గాను కెబిఎన్ కళాశాల యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు.