కేంద్రంలోని మితవాద మోడీ ప్రభుత్వం భారత దేశాన్ని టోకుగా అమ్మకానికి పెట్టింది. జాతీయ మోనిటైజేషన్ పైప్‌లైన్ పేరుతో ఆరు లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తులను అమ్మేసేందుకు సిద్ధపడింది. నీతి ఆయోగ్, ఆర్థిక శాఖకు అనుబంధంగా ఏర్పాటైన డిపార్ట్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మేనేజ్‌మెంట్ (దీపం) కలసి రూపొందించిన ప్రణాళికను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ఆవిష్కరిస్తూ, రోడ్లు, రైల్వేలు, విద్యుత్ ట్రాన్స్‌మిషన్ లైన్స్, గ్యాస్ పైపులైన్స్, టెలికమ్యూనికేషన్స్, పబ్లిక్ వేర్‌హౌసింగ్, ఉపరి తల రవాణా, గనులు, రేవులు, స్టేడియాలను వేటినీ వదల్లేదు. వచ్చే నాలుగేళ్లలో వీటన్నిటిని ప్రైవేటు పెట్టుబడిదారులకు అప్పగించేందుకు మోడీ ప్రభుత్వం ఎంతగా తహతహలాడుతున్నదీ ఆమె ప్రకటన చూస్తే అర్థమవుతుంది. ప్రధానంగా రోడ్లు, రైల్వేలు, రేవులు, విమానాశ్రయాలు వంటి అత్యంత కీలక రంగాలకు చెందిన ఆస్తులే దాదాపు నాలుగు లక్షల కోట్ల వరకు ఉన్నాయి. ప్రజల ఆస్తులకు సంరక్షకురాలిగా వుండాల్సిన ప్రభుత్వం ఇలా జాతి సంపదను ఆశ్రిత పెట్టుబడిదారులకు కట్టబెట్టడం రాజ్యాంగ మౌలిక స్ఫూర్తికే విరుద్ధం. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం గావించే నయా ఉదారవాద విధానాలను పివి నరసింహారావు ప్రభుత్వం ప్రవేశపెట్టగా, వాజ్ పేయి ప్రభుత్వం దానిని మరిన్ని రంగాలకు విస్తరింపజేసింది. మోడీ ప్రభుత్వం వచ్చాక మొత్తం ప్రభుత్వ రంగాన్నే నాశనం చేయడానికి పూనుకుంది. ప్రజల ప్రయోజనాలను గాలికొదిలేసి కార్పొరేట్ల ప్రయోజనాలే తనకు ముఖ్యమని ఎలాంటి ముసుగు లేకుండా నిర్లజ్జగా చాటుకుంటున్నది. ఆత్మనిర్భర్ భారత్ పేరుతో ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచి, స్వావలంబనకు బాటలు వేసిన ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడమే గాక, వాటి ఆస్తులను కూడా తెగనమ్ముతున్నది. కోవిడ్ ఆంక్షలు, లాక్‌డౌన్ వల్ల పన్నుల రాబడి తగ్గి, బడ్జెట్‌లో పెరిగిన లోటును పూడ్చుకునేందుకు ప్రభుత్వ ఆస్తులను 'నగదీకరణ' (మోనిటైజ్) చేస్తున్నామని ఆర్థికమంత్రి చెప్పిన మాటల్లో ఇసుమంత కూడా నిజం లేదు. ఇది దేశ ప్రజలను దగా చేయడమే. ఇంతకుముందు కూడా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన భారత్ పెట్రో కెమికల్స్ లిమిటెడ్ (బిపిసిఎల్),హెచ్‌పిసిఎల్ వంటి మహారత్నాలు, నవరత్నాలను ఈ ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. ప్రభుత్వ రంగ సంస్థలను ఒకవైపు బహిరంగంగా అమ్మకానికి పెడుతూ, ఇది అమ్మకం కాదు, ఆస్తుల్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవడమే నని మంత్రి సీతారామన్ చెప్పడం అతి పెద్ద జోక్. ప్రభుత్వ ఆస్తుల అమ్మకానికి 'నగదీకరణ' అని పేరు పెట్టడంలోనే ప్రభుత్వ మోసకారితనం వెల్లడవుతున్నది. సంక్షోభ సమయంలో మార్కెట్ రేటు తక్కువగా ఉన్న సమయంలో డిస్కౌంట్ ఇచ్చి ప్రైవేట్ పెట్టుబడిదారులకు కట్టబెట్టాలని చూస్తున్నది. ఇది ప్రజల ఆస్తులను కార్పొరేట్లకు దోచిపెట్టడమే తప్ప మరొకటి కాదు. ఒక వైపు ఈ ఆస్తుల అమ్మకం ద్వారా బడా పెట్టుబడిదారులకు లబ్ధి చేకూర్చుతున్న ప్రభుత్వం, మరో వైపు తద్వారా వచ్చిన డబ్బును కార్పొరేట్లకే తిరిగి రాయితీల రూపంలో ముట్టజెప్తున్నది. ప్రభుత్వ మతిమాలిన చర్య వల్ల ఆర్థిక వ్యవస్థ మరింతగా సంక్షోభంలో కూరుకుపోతుందే తప్ప బయటపడే పరిస్థితి ఉండదు. సంక్షోభం నుంచి బయటపడేందుకు ఒక్కటే మార్గం. ప్రజల కొనుగోలుశక్తిని పెంచడమే. మౌలిక సదుపాయాల రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టడం వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అంతిమంగా ఇది ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోవడానికి దోహదపడుతుంది. మన పొరుగున ఉన్న చైనా ఇందుకు ఒక చక్కటి ఉదాహరణ. అక్కడ ప్రజల ఆస్తులకు ప్రభుత్వమే యజమాని, సంరక్షకురాలు కూడా. ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయడం, మౌలిక సదుపాయాల రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టడం ద్వారా చైనా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా నిలిచింది. దానికి విరుద్ధంగా ప్రభుత్వ రంగాన్ని బలహీనపరచి, కార్పొరేట్లకు సర్వం దోచిపెట్టే విధానాలను ఇక్కడి ప్రభుత్వం అనుసరిస్తున్నది. దీనివల్ల దేశ స్వావలంబనకే కాదు, మన ఆర్థిక వ్యవస్థకు తీరని నష్టం కలుగుతుంది. ప్రజల ఆస్తులను కాపాడుకోవడానికి దానితోపాటు మన స్వావలంబనను ఏ మేరకైనా నిలుపుకోడానికి ప్రజలు ఉద్యమించాలి.










