May 20,2023 23:05

ప్రజాశక్తి - కలిదిండి
            ఇటీవల దారుణ హత్యకు గురైన బిరుదుగడ్డ శేఖర్‌ కుటుంబానికి న్యాయం చేయాలని ఎస్‌సి కమీషన్‌ రాష్ట్ర ఛైర్మన్‌ మారుమూడి విక్టర్‌ ప్రసాద్‌ అన్నారు. కోరుకొల్లులో బాధిత కుటుంబాన్ని ఆయన శనివారం పరామర్శించారు. మృతుని కుటుంబానికి ఐదు ఎకరాల పొలం, ఐదు సెంట్ల స్థలంతో పాటు ఇంటి నిర్మాణం, ఇంట్లో ఒకరికి ఉద్యోగం, తల్లిదండ్రుల్లో ఒకరికి పింఛన్‌ సౌకర్యం కల్పించేలా చర్యలు చేపట్టాలన్నారు. హత్య చేసిన వ్యక్తిని తప్పించిన స్టేషన్‌ రైటర్‌ గోవర్ధన్‌ను సస్పెండ్‌ చేయాలని, నిందితులు నలుగురిని వెంటనే అరెస్ట్‌ చేయాలన్నారు.
హత్య చేసినవారిని శిక్షించాలి : సిపిఎం
తాడినాడ మద్యం దుకాణంలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న బిరుదుగడ్డ శేఖర్‌బాబును హత్య చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని సిపిఎం మండల కార్యదర్శి శేషపు మహంకాళరావు డిమాండ్‌ చేశారు. కోరుకొల్లులో మృతుని శేఖర్‌ కుటుంబ సభ్యులను ఆయన శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా మహంకాళరావు మాట్లాడుతూ హత్యకు సహకరించిన వారందరినీ అరెస్ట్‌ చేసి శిక్షించాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే బాధితుల తరపున న్యాయం జరిగే వరకూ పోరాడతామన్నారు. కెవిపిఎస్‌ జిల్లా అధ్యక్షులు ముంగం సురేష్‌, సిపిఎం కార్యకర్తలు జక్కుల మహేష్‌, పంతగాని ప్రకాష్‌, చిన్నం శ్రీకాంత్‌ పాల్గొన్నారు.
ముదినేపల్లి : శేఖర్‌ హత్య కేసులోని నిందితులను అరెస్ట్‌ చేయాలని మాల మహానాడు కైకలూరు నియోజవకవర్గ అధ్యక్షులు ముత్యాల శ్రీనివాసరావు అన్నారు. శనివారం ఆయన ముదినేపల్లిలో మాట్లాడుతూ నిందితులను అరెస్ట్‌ చేయకుంటే మాలమహానాడు ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని చెప్పారు.