Sep 26,2023 22:00

కాలువలో పేరుకు పోయిన చెత్త

ప్రజాశక్తి - పార్వతీపురం టౌన్‌ : స్థానిక మున్సిపల్‌ పరిధిలో గల 30 వార్డుల్లో ప్రతి రోజూ ఇంటింటి చెత్త సేకరణ జరుగుతున్నప్పటికీ ఆయా వార్డుల్లో కాలువల పరిస్థితి అధ్వానంగా ఉంది. ఈ కాలువల్లో పూడికలు పేరుకుపోయి మురుగునీరు పారేందుకు అవకాశం లేక దుర్వాసన వెదజల్లుతుండడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షాకాలానికి ముందే కాలువల్లో పూడికలను తొలగించేందుకు సంబంధిత మున్సిపల్‌ అధికారులు చర్యలు చేపట్టకపోవడంతోనే ఈ సమస్య వచ్చిందని స్థానికులు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఏమాత్రం చిన్నపాటి వర్షం కురిసినా పట్టణంలోని మురుగునీరు రోడ్లపై ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. వీటితోపాటు కొన్ని ప్రాంతాలలో రోడ్లపై నీరు నిలిచిపోయి దోమలకు నిలయాలుగా మారుతుండడంతో రోగాలు ప్రబలే అవకాశం ఉందని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అడపాదడపా వర్షాలు కురవడంతో పూడిక తీతలు తీసేందుకు అవకాశం లేదు కనుక ప్రజారోగ్య విభాగం అధికారులు పారిశుధ్య కార్మికులచే ఉదయం పూట ఇంటింటికి చెత్త సేకరణ చేయించి, మధ్యాహ్నం పూట కాలువలను శుభ్రం చేయించి ఈ సమస్య పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.