బువ్వ పెట్టే బతుకుల
బుగ్గి పాలు చేయొద్దు
సాగుబడి చేసే ఇంట
చితి మంటలు రేపొద్దు
దుక్కి దున్నే రెక్కలకు
చట్టాల సంకెళ్లు వేయొద్దు
చెమట చిందేంచే దేహాల
చీకటి చెరల బంధించొద్దు
నవ భారత నిర్మాతల
దేశ ద్రోహులుగా చిత్రించొద్దు
న్యాయబద్ద ఆందోళనకు
అపరాధం అంటగట్టొద్దు
కర్షక కాయ కష్టం కాజేసి
కార్పొరేట్లకు కట్టబెట్టొద్దు
అన్నదాత అశ్రుధారతో...
బ్యూరోక్రాట్ల కాళ్ళు కడగొద్దు
రైతు కడుపు మంటతో
డెకాయిట్లకు హారతి పట్టొద్దు
సాగుబడికి సమాధి కట్టొద్దు
దేశాన్ని అమ్మకానికి పెట్టొద్దు
ఎద్దు ఏడ్చిన పుడమి ...
సస్యశ్యామల క్షేత్రమై వర్ధిల్లదు
రైతు కలత చెందిన
రాజ్యం ...
శాంతి సౌభాగ్యాలతో విలసిల్లదు
అయ్యా పాలక వర్యా!
ఇప్పటికైనా గురుతెరిగి
మొక్కుబడి చర్చల పక్కనెట్టి
నల్ల చట్టాల ఉపసంహరించు
సాగుబడికి స్వేచ్ఛ ప్రసాదించు
అన్నదాతకు ఆదరువుగా నిలువు.
(నల్ల చట్టాల రద్దు కోసం)
- కోడిగూటి తిరుపతి,
సెల్ : 95739 29493










