ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల మూడ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల గుంటూరు, పల్నాడు జిల్లాలోని వివిధ మండలాల్లో ఖరీఫ్ సాగు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే చాలీచాలని వర్షాలతో ఖరీఫ్ సాగు జాప్యమైంది. సాధారణ వర్షాల కోసం పొలాల్లో దుక్కి దున్ని సిద్ధం చేసుకున్న భూమిలో తాజా కురుస్తున్న భారీ వర్షాలతో వర్షం నీరు చేరడంతో మొత్తం బురదమయంగా మారింది. ఈ బురద ఎండిన తరువాత తిరిగి నేలను పదును చేయాలంటే కనీసం 10 రోజులు పడుతుందని వ్యవసాయ శాఖ జిల్లా అధికారి ఎన్.వెంకటేశ్వర్లు అభిప్రాయపడ్డారు.
రెండు జిల్లాల పరిధిలో వ్యవసాయ భూమి ఎక్కువగా నల్లరేగడి భూమి ఉండటం వల్ల వర్షాలతో పొలాల్లో నిలిచిన బయటకు పోయిన తరువాత కొంత ఎండిన తరువాత మట్టిని తిరిగేసి మళ్లీ సాళ్లు పోసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రధానంగా మెట్ట పంటలకు మరో సారి భూమిని పదును చేసుకోవడం కోసం అదనపు ఖర్చు అవుతుంది. ఇప్పటికే విత్తనాలు నాటేందుకు భూమిని సిద్ధం చేయగా అధికవర్షాలు కురిసిన ప్రాంతాల్లో కాల్వలు సరిగా లేక పొలాల్లోనీరు నిలిచి ఉంది. దీంతో రైతులకు ఆదిలోనే కష్టాలు ఎదురవుతున్నాయి.
ఇప్పటికే వరి, పత్తి సాగు చేసిన రైతులకు ముంపు సమస్య పొంచి ఉంది. వారం క్రితం సాగు చేసిన వరి, పత్తి పంటలకు వర్షాలు తీవ్ర నష్టం కల్గించాయి. ప్రధానంగా వెదపద్ధతిలో సాగుచేసిన వరికి, ఇటీవల పత్తి విత్తనాలు నాటిన పొలాల్లో కూడా నీరు చేరడం వల్ల తొలకరి దశలోనే పైర్లకు నష్టం వాటిల్లుతోంది. గుంటూరు జిల్లాలోని అన్ని మండలాల్లో ఇప్పటికే అవసరానికి మించి వర్షం కురిసింది. కొల్లిపరలో మండలంలో జులైనెలలో 168 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా ఈనెలలో ఇప్పట ివరకు రికార్డు స్థాయిలో 433 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. బుధవారం కూడా రెండు జిల్లాల పరిధిలోని పలు మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి.
అల్పపీడనం ప్రభావంతో మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు జిల్లాలో అన్ని మండలాల్లో భారీవర్షం నమోదైంది. కొల్లిపరలో అత్యధికంగా 80.2 మిల్లీ మీటర్లు నమోదైంది. పల్నాడు జిల్లాలో 28 మండలాలకు గాను 10 మండలాల్లోనే ఒక మోస్తరువర్షం కురిసింది. అమరావతి, పెదకూరపాడు, సత్తెనపల్లి, అచ్చంపేట, క్రోసూరు, మాచర్ల, బెల్లంకొండ, గురజాల, దుర్గి, వెల్దుర్తి మండలాల్లో 20 మిల్లీ మీటర్లు దాటి వర్షం కురిసింది. మిగతా 18 మండలాల్లో 20 మిల్లీమీటర్ల కన్నా తక్కువ వర్షం కురిసింది. పెదకూరపాడు నియోజకవర్గంలో గతరెండు రోజులుగా భారీ వర్షాలు కురవడం వల్ల అమరావతి వద్ద పెదమద్దూరు వాగు పొంగి ప్రవహించింది. దీంతో విజయవాడ- అమరావతి మధ్యరాకపోకలు నిలిచాయి.
నాన్పుడు వర్షాలతో గుంటూరు, పల్నాడు జిల్లాలోని రహదారులు దెబ్బతిన్నాయి. పలు కాలనీల్లో రహదారులు బురదమయంగా మారాయి. కొన్ని ప్రాంతాల్లో రోడ్లు పంట పొలాలను తలపిస్తున్నాయి. గుంటూరులో బుధవారం వేకువజాము నుంచి సాయంత్రం వరకు కుండపోతగా వర్షం కురవడంతో పలు ప్రాంతాల్లో రోడ్లపై వర్షం నీరుపారింది. పలు కాలనీల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జులైలో గుంటూరు జిల్లాలో 164.9 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఇప్పటివరకు 254.4 మిల్లీమీటర్లు నమోదైంది. పల్నాడు జిల్లాలో 131 మిల్లీ మీటర్లకు గాను 97.4 మిల్లీ మీటర్లు నమోదైంది.
గుంటూరు జిల్లా:
కొల్లిపర 80.2 మిల్లీ మీటర్లు
తాడికొండ 60.4
తుళ్లూరు 51.8
దుగ్గిరాల 50.8
తాడేపల్లి 49.6
గుంటూరు(ప) 48.2
గుంటూరు(తూ) 47.2
మంగళగిరి 47.2
చేబ్రోలు 45.4
పెదకాకాని 42.6
మేడికొండూరు 37.6
వట్టిచెరుకూరు 35.8
పొన్నూరు 32.8
ప్రత్తిపాడు 29.8
ఫిరంగిపురం 29.2
తెనాలి 25.2
పెదనందిపాడు 22.6
కాకుమాను 20.8
పల్నాడు జిల్లా :
అమరావతి 56.2
బెల్లంకొండ 45.2
పెదకూరపాడు 34.2
వెల్దుర్తి 25.2
అచ్చంపేట 24.6
గురజాల 23.4
దుర్గి 23.4
సత్తెనపల్లి 23.2
క్రోసూరు 22.8
మాచర్ల 20.4










