Jul 06,2023 00:50

ప్రజాశక్తి -గుంటూరు జిల్లా ప్రతినిధి : నైరుతీ రుతుపవనాల ప్రభావంతో గుంటూరు, పల్నాడు జిల్లాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. బుధవారం రెండు జిల్లాల పరిధిలోని వేర్వేరు ప్రాంతాల్లో ఒక మోస్తరునుంచి భారీ వర్షం కురిసింది. గుంటూరులో సాయంత్రం సమయంలో కుండపోతగా వర్షం కురవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మంగళగిరి, తాడేపల్లి,పెదకాకాని, మేడికొండూరు, తెనాలి, దుగ్గిరాల, సత్తెనపల్లి, తాడికొండ, పత్తిపాడు తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మిగతా ప్రాంతాల్లో ఒక మోస్తరుగా వర్షం కురిసినట్టు సమాచారం అందింది. పెదకాకాని వద్ద పిడుగులు పడ్డాయి. గుంటూరులో సాయంత్రం 4 గంటల నుంచి వేర్వేరు ప్రాంతాల్లో భారీ వర్షం కురవడం వల్ల రోడ్లపైకి నీరు చేరి రాకపోకలకు అంతరాయం కల్గింది. మార్కెట్‌ సెంటర్‌లో ట్రాఫిక్‌ స్తంభించింది. అరండల్‌పేట బ్రిడ్జిపై నుంచి వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. తాజాగా కురుస్తున్నవర్షాల వల్ల జిల్లాలో ఖరీఫ్‌ సాగుకు ఉపయోగం ఉంటుందని వ్వవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.ఇప్పటి వరకుమందకొడిగా సాగిన ఖరీఫ్‌ సేద్యం రెండు మూడు రోజులల్లో ఊపందుకుంటుందని వ్వవసాయశాఖ అధికారులు తెలిపారు. సోమవారం నుంచి ప్రారంభం అయిన వర్షాలు క్రమంగా ఊపందుకోవడం వల్ల జిల్లాలోని కొన్ని మండలాల్లో నెలకొన్న వర్షాభావం తాత్కాలికంగా తొలగిపోయింది. గత నెలలో గుంటూరు,పల్నాడు జిల్లాల్లో చాలావరకు సాధారణ వర్షంపాతం నమోదు కాగా 27 మండలాల్లో లోటు పరిస్థితి ఏర్పడింది. జులైలో వర్షాలు మెరుగుపడటంతో సేద్యానికి అనుకూల వాతావరణం ఏర్పడుతోంది. దీంతో రైతులు సాగుకు సిద్ధం అవుతున్నారు. గుంటూరు జిల్లాలో జూన్‌ నెల మొత్తం 97.1 మిల్లీ మీటర్లవర్షం కురవాల్సి ఉండగా ఇప్పటివరకు 105.8 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. జులైలో 164.9 మిల్లీ మీటర్ల వర్షపాతం అవసరం కాగా మొదటి నాలుగు రోజుల్లోనే 61.9 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయింది. పల్నాడుజిల్లాలో జూన్‌ నెలలో 80.9 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 81.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయింది.జులైలో 131 మిల్లీ మీటర్లకు గాను గత నాలుగు రోజుల్లో 13.2 మిల్లీ మీటర్ల వర్షపాతం మాత్రమే నమోదు అయినట్టు అధికార వర్గాలు తెలిపాయి. వర్షాలు మరోవారం కొనసాగితే పత్తి, మిర్చి సాగుకు రైతులు సమాయత్తం అవుతారు. ఇప్పటికే కొంత మంది పత్తిసాగుపై దృష్టి సారించారు. పల్నాడు జిల్లాలో 3.04 లక్షల ఎకరాలకు గాను 24 వేల ఎకరాల్లో పత్తి విత్తనాలు నాటారు. గుంటూరు జిల్లాలో పత్తిసాగుకు రైతులు భూమిని సిద్ధం చేశారు. ముందస్తు ఖరీఫ్‌లో భాగంగా తొలకరి పంటలుగా కొంత మంది రైతులు నువ్వు, పెసర, మినుము, జూట్‌,జనుము,గ్రీన్‌ మెన్యూర్‌ పంటలను సాగు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.