ప్రజాశక్తి - పోలవరం
రాబోయే ఆర్థిక సంవత్సరం 2024 - 2025 చేపట్టబోయే పనుల ప్రణాళికా ప్రక్రియలో భాగంగా పనులను గుర్తించడానికి గ్రామస్థాయి టీంలు వేశామని, వారు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం పనులు గుర్తింపు కావాల్సి ఉంటుందని ఎపిఒ వెంకటేశ్వరరావు తెలిపారు. ఎంపిడిఒ జి.శ్రీను ఆధ్వర్యంలో జరిగిన మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాథి హామీ చట్టానికి సంబంధించి హాఫ్ డే ఓరియంటేషన్ ప్రోగ్రాంను మండల సమైక్య ఆవరణలో నిర్వహించామని వెంకటేశ్వరరావు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోలవరం ఎంపిపి సుంకర వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎపిఒ మాట్లాడుతూ టీంలు నవంబర్ లోపు గ్రామీణ ఉపాథి హామీలో చేపట్టిన పనులను గ్రామస్థాయిలో గుర్తించాలని టీంలకు తెలిపారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాథి హామీ చట్టం ద్వారా పనులు కల్పించడానికి, పని దినాలను పెంచడానికి చేపట్టవలసిన చెరువుల పూడిక తీతలు, ఉద్యానవన పంటల సాగు, నీటి కుంటలు ఏర్పాటు, కందకాలు తీయడం, కాలువ పుడికతీత తదితర పనులను క్షేత్రస్థాయి సిబ్బంది గుర్తించి, ఎంపిక చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఆర్‌ఇజిఎస్ టిఎలు, ఎఫ్‌ఎలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, అగ్రికల్చర్ అసిస్టెంట్లు, విలేజ్ సర్వేయర్లు పాల్గొన్నారు.










