Aug 18,2023 22:23

గేట్లు ఎక్కి వస్తున్న నాయకులు

గేట్లు ఎక్కి వస్తున్న నాయకులు
సదుపాయాల కల్పనలో ప్రభుత్వ వైఫల్యం
-కార్పొరేషన్‌ ఎదుట సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో మహాధర్నా
ప్రజాశక్తి-నెల్లూరు:రాష్ట్ర ప్రభుత్వం నగర నియోజకవర్గ పరిధిలో మౌలిక వసతుల కల్పనలో విఫలమైందంటూ కార్పొరేషన్‌ కార్యాలయం ఎదుట సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ప్రజానీకంతో మహాధర్నా కార్యక్రమం చేపట్టారు.శుక్రవారం నగర నియోజకవర్గ పరిధిలో ప్రజా సమస్యల పరిష్కరించాలని కోరుతూ సిపిఎం నగర కమిటీ చేపట్టిన ప్రజా పోరుయాత్ర ముగింపు సందర్భంగా బారాషాహీద్‌ గ్రౌండ్స్‌ నుంచి భారీ ప్రదర్శనను కార్పొరేషన్‌ కార్యాలయం వరకు నిర్వహించారు. అనంతరం నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట మహా ధర్నా చేపట్టారు. కార్పొరేషన్‌ కమిషనర్‌ వచ్చి సమస్యలపై సమాధానం చెప్పాలని సిపిఎం నాయకులు పట్టు పట్టడంతో వారిని లోపలికి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. గేటు వద్ద తోపులాట,ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నగర మేయర్‌ పొట్లూరి స్రవంతి గేటు వద్దకు విచ్చేసి ప్రజలతో సిపిఎం నాయకులతో మాట్లాడడంతో సామరస్య వాతావరణం నెలకొంది.
ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు, నగర కార్యదర్శి వర్గ సభ్యులు జి. నాగేశ్వరరావు మాట్లాడుతూ నగర నియోజకవర్గంలో సిపిఎం ప్రజా పోరుయాత్ర పేరుతో 28 వార్డులలో పాదయాత్ర నిర్వహించామన్నారు. ప్రజలందరినీ కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకునే కార్యక్రమం జరిగిందన్నారు. నగరం పెన్నా నది ఒడ్డునే ఉన్నా 28 వార్డులలో ఎక్కడ కూడా తాగేందుకు గుక్కెడు మంచినీళ్లు కార్పొరేషన్‌ కుళాయిలలో రావడం లేదన్నారు. ప్రతి కుటుంబం మంచినీళ్లను కొనుక్కుని తాగుతుందన్నారు. పరోక్షంగా వైసిపి ప్రభుత్వం మంచినీళ్ల వ్యాపారాన్ని ప్రోత్సహిస్తుందన్నారు. ఓవైపు పెన్నా నది, మరోవైపు స్వర్ణాల చెరువు లాంటి పుష్కలమైన నీటి వనరులు ఉన్నప్పటికీ నగరంలో ఇటువంటి పరిస్థితి దాపురించడం సిగ్గుచేటన్నారు. పారిశుధ్య కార్మికులు తక్కువగా ఉండడం చేత పారిశుధ్యం లోపించిందన్నారు. వంట కాలువలు వ్యర్ధాలతో నిండిపోయి దుర్గంధపరితంగా తయారై ఉన్నాయన్నారు. దోమల విజంభిస్తున్నాయని, డయేరియా, విష జ్వరాలతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. యుద్ధ ప్రాతిపదికన కనీస మౌలిక సదుపాయాల కల్పనకు తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. 53 , 54 డివిజన్‌ లలో ప్రభుత్వ బ్యాంకును ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించాలని, దాంతో ముడిపెట్టి రద్దు చేసిన రేషన్‌ కార్డులు,పెన్షన్లను తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. టిడ్కో గహాలలో కనీస సదుపాయాలు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. జిల్లా అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే స్పందించి నగర నియోజకవర్గ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోకపోతే సిపిఎం ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. అనంతరం ప్రజలు కార్పోరేషన్‌ కార్యాలయంలోకి వెళ్లి కమిషనర్‌ లేదా మేయర్‌ ఎవరు అందుబాటులో ఉంటే వారికి వినతిపత్రం అందజేసి వెనుదిరిగి వెళ్తామంటూ పోలీసులతో వాదనకు దిగారు. ఈ సమయంలో అప్పటి వరకు ప్రశాంతంగా సాగిపోతున్న మహాధర్నాలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. కార్పొరేషన్‌ కార్యాలయంలోకి వెళ్లేందుకు పోలీసులు అనుమతించకపోవడంతో ఇరువురి మధ్య తోపులాటలు చోటు చేసుకున్నాయి. చివరకు పోలీసు అధికారులు సమాచారాన్ని మేయర్‌కు అందజేయడంతో కార్యాలయం నుంచి ప్రజల వద్దకు చేరుకొని వారి సమస్యలను తెలుసుకున్నారు. మేయర్‌ చొరవతో శాంతియుతంగా చేకూరింది. ప్రజలు కార్యాలయం ఆవరణలోకి వచ్చి మేయర్‌కు వినతిపత్రం అందజేస్తామన్నారు. ఇందుకు అంగీకరించిన మేయర్‌ , సిపిఎం నాయకులతో, ప్రజలతో కలిసి నడిచి కార్యాలయం వద్దకు చేరుకొని వినతిపత్రం స్వీకరించారు. అనంతరం మేయర్‌ మాట్లాడుతూ సమస్యలను పరిష్కరించేందుకు కషి చేస్తానని హామీని ఇచ్చారు. మేయర్‌ హామీతో మహా ధర్నా కార్యక్రమాన్ని సిపిఎం నాయకులు ముగించారు.కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు షేక్‌ మస్తాన్‌బీ, పి.సూర్యనారాయణ, నగర కమిటీ సభ్యులు బీపీ నరసింహ, కత్తి పద్మ, మూలం ప్రసాద్‌, ఆర్‌ శ్రీనివాసులు, ఎన్‌ వి సుబ్బమ్మ, పి.వేణు, కె.చిరంజీవి, శాఖా కార్యదర్శులు శ్రీనివాసులు రెడ్డి, నారాయణ, రఫీ, జాఫర్‌, ఫయాజ్‌, ప్రసాద్‌,అంకయ్య, అమాన్‌, బాబురావు పాల్గొన్నారు.