Oct 18,2023 22:24

ప్రజాశక్తి - సోమల
సదుం మండల ప్రజల ఆరోగ్య అవసరాల రీత్యా 50 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించినట్లు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, ఎంపి మిథున్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆస్పత్రిని ప్రారంభించారు. సదుం ఆస్పత్రికి అన్ని సదుపాయాలు కల్పిస్తామని కలెక్టర్‌ షన్మోహన్‌ ప్రకటించారు. సదుం సమీపంలో 3.47 కోట్లతో 50 పడకల ఆస్పత్రిగా అప్డేట్‌ చేసిన సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. కె.నారాయణస్వామి మాట్లాడుతూ కుల, మత, ప్రాంతం, పార్టీలను చూడకుండా నవరత్నాల పథకాన్ని ఒక సంపదగా ముఖ్యమంత్రి అర్హులైన ప్రతి కుటుంబానికి అందిస్తున్నారన్నారు. విద్య, వైద్యానికి ప్రాధాన్యత ఇస్తున్నామని, పరిశ్రమల స్థాపన ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ సిఎం జగన్మోహన్‌రెడ్డి హయాంలో 50 పడకలుగా ఆస్పత్రిని అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఇప్పటివరకూ సదుం ఆస్పత్రి నిర్మాణానికి రూ.9.1 కోట్లు ఖర్చు చేశామని, రూ.3.45 కోట్లతో అదనపు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశామన్నారు. ఆస్పత్రిలో అవసరమైన వైద్య సిబ్బంది, మందులు, వైద్య పరికరాలను పూర్తిస్థాయిలో సమకూర్చాలని కలెక్టర్‌కు సూచించారు. ప్రతి గ్రామంలో ఓవర్‌హెడ్‌ ట్యాంకు నిర్మించి గండికోట రిజర్వాయర్‌ నుంచి నీటిని నింపి ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన నీటిని అందిస్తామన్నారు. ఎంపి పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీల్లో భాగంగా 3.5 ఎకరాల విస్తీర్ణంలో 50 పడకల ఆస్పత్రి నిర్మాణం చేపట్టామన్నారు. వైద్యం నిమిత్తం సదుం ప్రజలు పీలేరు, తిరుపతికి వెళ్లే అవసరం లేకుండా తగిన ఏర్పాట్లు చేస్తామన్నారు. చిత్తూరు ఎంపి రెడ్డెప్ప, కలెక్టర్‌ ఎస్‌.షన్మోహన్‌, తంబళ్లపల్లి ఎంఎల్‌ఎ పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి పాల్గొన్నారు. ఏనుగుల దాడిలో పంటలు నష్టపోయిన రైతులు 124 మందికి రూ.12.64 లక్షలు, ఆయుష్మాన్‌ భారత్‌ కింద హెల్త్‌ కార్డుల పంపిణీ, సిఎం రిలీఫ్‌ఫండ్‌ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిసిహెచ్‌ఎస్‌ డాక్టర్‌ రాజశేఖర్‌రెడ్డి, జడ్‌పి సిఇఒ ప్రభాకర్‌రెడ్డి, ఎపిఎంఐ డిసిఎస్‌సి కృష్ణారెడ్డి, రాష్ట్ర జానపద కళల అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కొండవీటి నాగభూషణం, పికెఎం వుడా ఛైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌ పాల్గొన్నారు.