
ప్రజాశక్తి గోరంట్ల రూరల్ : ఈనెల 28న గోరంట్లలో చేపట్టే శ్రామిక మహిళా జిల్లా సదస్సును జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇఎస్ వెంకటేష్ కోరారు.. ఈసందర్భంగా ఆయన గోరంట్ల మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ దేశంలో పెరుగుతున్న పేదరికం, కొనుగోలు శక్తి పడిపోవడం తదితర కారణాలతో మహిళలు అనివార్యంగా పనులకు వెళ్లాల్సి వస్తోందన్నారు. పిల్లల పెంపకం, అనారోగ్యం తదితర కారణాలతో కుటుంబాలను కాపాడుకోవడానికి శ్రామిక మహిళలుగా మారుతున్నారన్నారు. సత్యసాయి జిల్లాలోని కియా పరిశ్రమలో వీరి సంఖ్య పెరిగిందన్నారు. టీచర్లు, జర్నలిస్టులు, న్యాయవాదులు, పోలీసు, హోంగార్డు, వ్యవసాయ తదితర అనేక రంగాలలో శ్రామిక మహిళల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. ఈ నేపథ్యంలో కష్టంతో పాటు మహిళలపై వేధింపులు పెరిగాయన్నారు. వీటి అన్నిటిపైనా ఈనెల 28న గోరంట్ల మండల కేంద్రంలోని షాదీమహల్‌లో నిర్వహించే సదస్సును జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు రమేష్, పెడబల్లి బాబా, జిల్లా కమిటీ సభ్యులు వెంకటేష్, వెంకట్రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.