Jul 01,2023 00:35

డయాలసిస్‌ చేయించుకుంటున్న చంద్రమౌళి

ప్రజాశక్తి - వడ్డాది
90 శాతం వికలాంగుడై, ప్రభుత్వ గుర్తింపు పొందిన సదరం సర్టిఫికెట్‌ ఉన్నా పింఛను మంజూరు కాలేదు. మరో పక్క కిడ్నీ వ్యాధితో బాధపడుతూ హాస్పిటల్లో డయాలసిస్‌ చేయించుకుంటున్నా ఆ పెన్షన్‌ కూడా మంజూరు చేయని పరిస్థితి నెలకొంది. బుచ్చయ్యపేట మండలం, వడ్డాది మేజర్‌ పంచాయతీకి చెందిన దొండా చంద్రమౌళి కొంతకాలం క్రితం షుగర్‌ వ్యాధితో బాధపడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో కాలికి తగిలిన గాయం షుగర్‌ వ్యాధి వల్ల మానకపోవడంతో కాలును పూర్తిగా తొలగించారు. ఈ నేపథ్యంలో సదరం సర్టిఫికెట్‌కు దరఖాస్తు చేసుకుంటే పరీక్షించిన వైద్యులు 90శాతం వైకల్యం ఉన్నట్లు సదరం సర్టిఫికెట్‌ ఇచ్చారు. ఈ సర్టిఫికెట్‌ ఆధారంగా పింఛను కోసం పలు మార్లు దరఖాస్తు చేశారు. అయినా చంద్రమౌళికి పింఛను మంజూరు చేయలేదు. దీనిపై సంబంధిత అధికారులను అడిగితే ఇన్‌కం ట్యాక్స్‌ చెల్లిస్తున్నట్లు చూపిస్తుందని, కనుక పెన్షన్‌ మంజూరు కాలేదని తెలిపారు. ఇతనికి రైస్‌ కార్డు వున్నా పింఛను ఇవ్వడం లేదు. మరో వైపు చంద్రమౌళి కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ఆసుపత్రిలో డయాలసిస్‌ చేయించుకుంటున్నారు. అయినా అటు వికలాంగ పింఛను, ఇటు కిడ్నీ వ్యాధి గ్రస్తుని పింఛను రెండూ మంజూరు చేయడం లేదు. జగనన్న సురక్ష కార్యక్రమంలోనైనా తనకు పింఛను మంజూరు చేసి ఆదుకోవాలని చంద్రమౌళి కోరుతున్నారు.