ప్రజాశక్తి-నర్సీపట్నంరూరల్:జిల్లా వ్యాప్తంగా నిర్వహిం చే సదరం క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ ఎం.నీలవేణి దేవి కోరారు. బుధవారం ఏరియా ఆసుపత్రిలో మానసిక సమస్యలపై సదరన్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ మాట్లాడుతూ, రెండు రోజులపాటు ఈ క్యాంపు జరుగుతుందని, ముందుగానే స్లాట్ బుక్ చేసుకున్న మానసిక ఇబ్బందులు ఉన్నవారిని పరీక్షించి నిపుణులైన వైద్యులు సర్టిఫికెట్లు జారీ చేస్తారని తెలిపారు. ఆజాది కా అమృత్ మహౌత్సవ్‌లో భాగంగా రక్తదాన శిబిరాలు, సదరన్ క్యాంపులు వంటి కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఈ సదరన్ క్యాంప్‌లో ముందుగా స్లాట్ బుక్ చేసుకున్న వారిని రోజుకు 60 మంది చొప్పున 120 మందిని నిపుణులైన ఇద్దరు వైద్యులు పరీక్షించి, వారి మానసిక అంగవైకల్య శాతాన్ని నిర్ధారిస్తారన్నారు. ఈ నిర్ధారణ సర్టిఫికెట్ ఆధారంగానే ప్రభుత్వం నుంచి వచ్చే పెన్షన్, తదితర లబ్ది పొందే అవకాశం ఉందన్నారు. మానసిక వైద్యనిపుణులు, జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ తేజస్విని, పాడేరు జిల్లా ఆసుపత్రి సైకాలజిస్ట్ డాక్టర్ శివరామకృష్ణ, చిన్నారులను పరీక్షించారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్ సూపరింటెండెంట్ పద్మావతి, హెడ్ నర్సులు పాల్గొన్నారు.










